నేటి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించాయి. ఆర్టీసీ సంఘాలతో ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపించడం లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె యథాతథంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ఎస్మా చట్టాలకు భయపడవద్దని కార్మికులకు సూచించారు. సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు. ఉదయం నుంచి కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఇబ్బంది కలగనివ్వం...
ఆర్టీసీ సంఘాల సమ్మె నిర్ణయాన్ని త్రిసభ్య కమిటీ తప్పుపట్టింది. అధ్యయనం చేయకుండానే విలీనం కోసం హామీ ఇవ్వడం సరికాదని పేర్కొంది. ప్రత్నామ్నాయాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. 2,100 అద్దె బస్సులు, పాఠశాల బస్సులు నడుపుతామని వెల్లడించింది. అలాగే 3 వేల మంది డ్రైవర్లను తాత్కాలికంగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బస్సులు నడిపేందుకు భద్రత కల్పించాలని కలెక్టర్లు, ఎస్పీలకు కమిటీ ఆదేశించింది.