తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Teachers Allotment: పూర్తయిన ఉపాధ్యాయుల కేటాయింపు.. 25 వేల మందికి స్థానచలనం!

TS Teachers Allotment: రాష్ట్రవ్యాప్తంగా 20 వేల నుంచి 25 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలగనుంది. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా నుంచి ఉమ్మడి జిల్లాలోని మరో జిల్లాకు వారు వెళ్లనున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కేటాయింపు ప్రకియ ముగియగా…  మిగిలిన అయిదు జిల్లాల్లో కేటాయింపు ప్రక్రియ బుధవారం రాత్రికి పూర్తయింది.

TS Teachers Allotment
ఉపాధ్యాయుల కేటాయింపు

By

Published : Dec 23, 2021, 6:55 AM IST

TS Teachers Allotment: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలల్లో మొత్తం 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాత జిల్లాల్లో సర్వీస్‌ సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయులు ఇచ్చిన ఆప్షన్‌ ప్రకారం కొత్త జిల్లాల వారీగా కేటాయింపు ప్రక్రియ మొదలైంది. అన్ని జిల్లాల్లో కేటాయింపు పూర్తయితే 20 వేల నుంచి 25 వేల మంది ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు(ఉమ్మడి జిల్లా పరిధిలో) వెళతారని విద్యాశాఖ ఒక అంచనాకు వచ్చింది. సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరపగా… చివరకు జూనియర్లు ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. స్థానచలనం పొందేవారిలో అధిక శాతం మంది జూనియర్లు ఉంటారు. మూడు నాలుగేళ్లలో పదవీ విరమణ పొందేవారు కూడా ఉంటారని, వారు మారుమూల జిల్లా నుంచి ఇంటి భత్యం (హెచ్‌ఆర్‌ఏ) అధికంగా ఉన్న నగర ప్రాంతాలకు ఆప్షన్‌ ఇచ్చుకొని మరో జిల్లాకు వెళ్తారని చెబుతున్నారు. కొత్త జిల్లాలో కొద్ది సంవత్సరాలు చేస్తే పదవీ విరమణ తర్వాత తాను కోరుకున్న చోట స్థిరపడవచ్చని వారు భావిస్తున్నారు.

3 రోజుల్లో రిపోర్ట్‌ చేయాలి

కొత్త జిల్లాల వారీగా కేటాయింపుల తర్వాత ఉపాధ్యాయులకు మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశం వస్తోంది. అందులోని లింక్‌ను క్లిక్‌ చేస్తే కేటాయించిన జిల్లా, ఇతర వివరాలతో కూడిన ఉత్తర్వు పొందొచ్చు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాకే కేటాయిస్తే సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ), స్కూల్‌ అసిస్టెంట్లు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడికి మూడు రోజుల లోపు రిపోర్ట్‌ చేయాలి. ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు డీఈఓలకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్‌ తరువాతే వెళ్లేది

పనిచేస్తున్న జిల్లాలే దక్కిన వారు, మరో కొత్త జిల్లా పొందిన వారు ఆయా జిల్లాల్లో రిపోర్ట్‌ చేసినా… ప్రస్తుతం వారు పనిచేస్తున్న పాఠశాలలోనే పనిచేయాలి. కొత్త జిల్లాలకు ఎప్పుడు వెళ్లాలి, అక్కడ ఏ పాఠశాలల కేటాయింపు తదితర అంశాలపై విద్యాశాఖ తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని చెబుతోంది. ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతే ఆ ప్రక్రియ ఉండొచ్చని, అప్పటివరకు ఉన్నచోటే ఉంటారని చెబుతున్నారు.

‘సీనియారిటీ జాబితాలను వెబ్‌సైట్లో పెట్టాలి’

ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను అందుబాటులో ఉంచకుండానే జిల్లాలు కేటాయించడం వల్ల చాలా పొరపాట్లు జరిగాయని, అందుకే వాటిని వెబ్‌సైట్లో ఉంచాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ఇతర నేతలు విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియాను కోరారు. ఈ మేరకు వారు బుధవారం వినతిపత్రం సమర్పించారు. జోన్‌, మల్టీ జోన్‌ పోస్టుల కేటాయింపులు చేసే ముందు వినతులను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.

వితంతువులు, ఒంటరి మహిళలకూ అవకాశం ఇవ్వాలి

ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేవిధంగా దరఖాస్తులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై ఎస్‌టీయూటీఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే వితంతువులకు, ఒంటరి మహిళలకు, పరస్పర బదిలీలకు కూడా అవకాశం ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి పర్వత్‌రెడ్డి కోరారు. ఏ విధంగా భార్యాభర్తలను జిల్లాలకు కేటాయిస్తారో కనీసం మార్గదర్శకాలు ఇవ్వకపోవడం వల్ల టీపీటీఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:TS Teachers Transfers: తప్పుల తడకగా సీనియారిటీ జాబితా.. ఉపాధ్యాయుల అభ్యంతరాలు

ABOUT THE AUTHOR

...view details