కరోనా కారణంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడి.. గతి తప్పారని.. తిరిగి వారిని ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education Minister Sabitha Indrareddy) అన్నారు. కరోనా సమయంలో అధ్యాపకులు చేసిన కృషిని సబిత కొనియాడారు. రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవంలో (Teachers Day) మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వనరులను వినియోగించుకుని విద్యను అందించిన అధ్యాపకులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. డిజిటల్ తరగతులు నిర్వహించిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల మంది ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని.. 1.30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో చేరారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
డ్రాపవుట్లు లేకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 650 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా విద్యావ్యవస్థకు ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థులకు మానవతా విలువలు, నైతిక విలువలు నేర్పించేవారు ఉపాధ్యాయులేనని మంత్రి కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 650 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. వీళ్లందరికీ క్వాలిటీ విద్య అందిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అదే తరహా విద్య అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ప్రైవేటు పాఠశాలలను వదిలేసి గురుకులాల్లో చదువుకోవడానికి ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఉపాధ్యాయులు కూడా మీ పిల్లల కెరీర్ మీద ఎంత దృష్టి పెడుతున్నారో అదే విధంగా మీ పాఠశాలలో చదివే విద్యార్థులపై కూడా అంతే దృష్టి పెడతారని భావిస్తున్నా.
-- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
విద్యకు ప్రాధాన్యత...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) నాయకత్వంలో విద్యాశాఖపై ప్రత్యేక దృష్టిసారించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యపై, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు - విద్యార్థులకు మధ్య ఉండే అనుబంధం ఇటీవలి కాలంలో తగ్గిపోయిందని పశుసంవర్థక శాఖ తలసాని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు పాఠం అర్థం కాకుంటే... ఉపాధ్యాయుల ఇంటికి వెళ్లి అడిగేవాళ్లమని.. ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో అంకితభావం పెరగాలన్నారు.