తెలుగు రాష్ట్రాల రీజియన్‌లో యాభైలక్షల మందికిపైగా పన్నుచెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.31వేల 762 కోట్ల పన్నులు హైదరాబాద్ సర్కిల్ పరిధిలో వసూలయ్యాయి. 2017-18లో రూ.49 వేల 775 కోట్లు వసూలు కాగా... 2018-19లో రూ.60వేల 485 కోట్లు వసూలు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు లక్ష్యంగా పెట్టగా రూ.58 వేల 040 కోట్లు వసూలైంది. 2014-15తో పోలిస్తే 2018-19లో 82.73శాతం పన్నుల వసూళ్లు పెరిగాయి. జాతీయ పెరుగుదల సగటు 63.5శాతం కంటే ఇది ఎక్కువ.
నాలుగు నెలల్లోరూ.14 వేల 868 కోట్లు
2019-20 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల్లో ఇప్పటికే రూ.14 వేల 868 కోట్ల మేర ఆదాయపు పన్ను వసూలైనట్లు హైదరాబాద్ రీజియన్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎన్.శంకరన్ తెలిపారు. ఈ నెలాఖరులోగా రిటర్న్‌లు దాఖలు చేయకుండా....ఆ తరువాత చేసే వారు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
8 నుంచి పది లక్షల మంది
యేటా 8 నుంచి పది లక్షల మంది కొత్తగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లు ఫైల్ చేస్తారని భావిస్తున్నారు. ఈ నెల చివర వరకు గడువు పొడిగించడం వల్ల ఎక్కువ మంది రిటర్న్‌లు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నారు.