Support From Ex MLAs in Telangana Elections 2023 : రసవత్తరంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections) ప్రతీ ఓటు కీలకమే. పార్టీ చరీష్మాకున్న ఓటుబ్యాంకుతో పాటు.. అదనంగా ఓట్లుపడే అవకాశం రావడం అదృష్టమే. అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకుని విజయం సాధించాలని ప్రస్తుత అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : అయితే వీరి గెలుపునకు టికెట్ రాని అసంతృప్తుల నుంచి కాస్త ముప్పు ఎదురవుతోంది. ఇది గమనించిన అభ్యర్థులు చాకచక్యంగా వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎలాగో చివరకు రాజీకి వచ్చిన మాజీ నేతలు తాజా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు ఓట్లు వేసిన వారంతా ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి నిలుచుకున్న అభ్యర్థులకు ఓటు వేయాలని వారి గెలుపు కోసం వీరు తాపత్రయపడుతున్నారు. ఇలా మాజీ నేతల ఓట్లలో సగం ఓట్లు తమకు వచ్చినా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు.
ఇదీ తెలంగాణలో తాజా - మాజీల 'రాజీ'కీయం.....
నర్సాపూర్ నియోజకవర్గంలో 2018లో జరిగిన ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డి(కాంగ్రెస్)ని బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి ఓడించారు. కొంతకాలానికి ఆమె బీఆర్ఎస్లో చేరి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ అయ్యారు. తాజాగా పార్టీ ఆమెను అభ్యర్థిగా ఎంపికచేసి, టికెట్ కేటాయించింది. ఇప్పుడు సునీతకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మద్దతు పలికారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి టికెట్ రాలేదు. తమ పార్టీ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దన్‌రెడ్డి(BRS)... నాగం జనార్దన్‌రెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. ప్రస్తుతం నాగం బీఆర్ఎస్లో చేరి మర్రి విజయానికి పాటుపడుతున్నారు. ఆర్మూర్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పి.వినయ్‌కుమార్‌రెడ్డి.. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫారం సాధించారు. ఇప్పుడు వినయ్‌తో.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత కలిసి పనిచేస్తున్నారు.
EX MLAs Support To Present Candidates in Telangana :మహేశ్వరంలో సబితారెడ్డి(కాంగ్రెస్)...అప్పుటి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలిచారు. అనంతరం సబితా బీఆర్ఎస్ చేరి మంత్రి అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు కృష్ణారెడ్డి మద్దతిస్తున్నారు. తాండూరు స్థానంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలట్ రోహిత్‌రెడ్డి సైతం బీఆర్ఎస్లో చేరారు. మళ్లీ ఇప్పుడు ఆయనకే టికెట్ ఇచ్చింది. నాటి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మహేందర్‌రెడ్డి ఇప్పుడు రోహిత్‌కు మద్ధతిస్తున్నారు.