Different Course Combinations in Degree : బీఎస్సీలో బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌సైన్స్ సబ్జెక్టులు చదివే అవకాశం.. బీఎస్సీ విద్యార్థులే చదివే సైకాలజీ సబ్జెక్టును బీఏ విద్యార్థులు చదివే వీలు.. మ్యాథ్స్ స్టాటస్టిక్స్‌తోపాటు ఎకనామిక్స్ సబ్జెక్టును ఎంచుకునే ఛాన్స్.. ఇలా ఒకటేమిటి వినూత్న కాంబినేషన్లలో డిగ్రీ విద్య సరికొత్తగా విద్యార్థులకు అందుబాటులో ఉంది. విద్యార్థులు తమకు నచ్చిన.. ఆసక్తి ఉన్న సబ్జెక్టులు ఎంచుకుని చదువుకుంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని కాంబినేషన్లలో సబ్జెక్టులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఇలా నగరంలోని బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 56 రకాల కాంబినేషన్లు విద్యార్థులు ఎంచుకోవడం విశేషం. ఈ తరహాలో రాష్ట్రంలోనే అత్యధికంగా కోర్సులు అందిస్తున్న కళాశాలగా గుర్తింపు సాధించింది.
ఎలా సాధ్యమైంది..?
Bucket system in degree : గత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బకెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఏ, బీఎస్సీ, బీకాంలో సంప్రదాయంగా ఉండే సబ్జెక్టులనే అప్పటివరకు విద్యార్థులు చదివేందుకు వీలుండేది. బకెట్ విధానంలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వీలుంటుంది. సంప్రదాయ సబ్జెక్టులనే చదవాలనే విధానానికి స్వస్తి చెప్పింది. దీనికి తగ్గట్టుగా డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోనే బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల వినూత్నంగా నిలిచి ఎక్కువ కాంబినేషన్లతో కూడిన కోర్సులు అందిస్తోంది. అప్లయిడ్ న్యూట్రిషన్, బయోటెక్నాలజీతో కూడిన కోర్సు సైతం అందుబాటులో ఉంది.
పెరిగిన విద్యార్థులు..
గతంలో సెక్షన్‌కు కనీసం 20 మంది విద్యార్థులు చేరితేనే ఆ కోర్సును ప్రభుత్వ కళాశాలల్లో అందించేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను ఉన్నత విద్యా మండలి ఎత్తివేసింది. బేగంపేటలో అందిస్తున్న కొన్ని కోర్సులలో 10-15 మంది విద్యార్థులున్నా.. బోధన కొనసాగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థుల సంఖ్య సైతం పెరిగింది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరారు. ప్రస్తుతం డిగ్రీ 3,858 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 86 మంది అధ్యాపకులు బోధిస్తున్నారు. విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులకు తగ్గట్టుగా తరగతులను సర్దుబాటు చేసి బోధన కొనసాగిస్తున్నారు.