హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ(JNTU Hyderabad Updates)లో విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి కోరిన విద్యార్థినిని అవమానించేలా మాట్లాడిన హెచ్‌వోడీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ ఛాంబర్లో బైఠాయించి హెచ్‌వోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జేఎన్టీయూలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీజ అనే విద్యార్థిని జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతినివ్వాలంటూ హెచ్‌వోడీ శ్రీనివాసులును కోరింది. విద్యార్థులకు ఆటలెందుకంటూ.. చదువుపై దృష్టి పెట్టాలని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన హెచ్‌వోడీ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.