కొత్త ప్రదేశాల్ని ఒంటరిగా చుట్టేయాలన్న కోరిక చిన్నప్పటి నుంచే ఉండేది. అది అమ్మమ్మ ఊరే కావొచ్చు...అమెరికానే అయ్యి ఉండొచ్చు. ఇంజినీరింగ్ చదివినా, కార్పొరేట్ కెరీర్‌లో స్థిరపడినా...నా మనసు మాత్రం ఎప్పుడూ పర్యటనల మీదే ఉండేది. కానీ అమ్మ మాత్రం ఎక్కడికైనా వెళ్తానంటే భయపడేది. మొదట్లో వద్దన్నా...నా ఆసక్తి, క్షేమంగా తిరిగి వస్తున్నానన్న నమ్మకం ఆమెని ఒప్పుకునేలా చేశాయి. పర్యటన విశేషాల్ని స్నేహితులకు చెబితే ఆసక్తిగా విని. నువ్వు యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లోగ్స్ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చేవారు. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఓసారి అనుకోకుండా ఉత్తరాదికి చెందిన సేజల్‌కుమార్ ట్రావెల్ వ్లోగ్ చూశా. ఆ స్ఫూర్తితో ఏడాదిన్నర క్రితం నా పేరుతోనే ట్రావెల్ వ్లోగ్స్ చేయడం మొదలుపెట్టా. అలా మొదట నార్త్‌గోవా టూర్ వీడియో అప్‌లోడ్ చేశా. కొద్దిరోజుల్లోనే వేలల్లో వీక్షణలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో సోలో ట్రావెలింగ్‌పై దృష్టిపెట్టా.
భయం అంచుల్లో:
హిమాలయ ప్రాంతాల్లో పర్యటన కాస్త భిన్నంగా ఉంటుంది. విపరీతంగా కురిసే మంచు, ఇరుకైన రోడ్లు, కొండ అంచుల మీదుగా ప్రయాణం భయం, ఆనందం, ఆశ్చర్యం అన్నీ కలగలిపిన అనుభూతిని ఇస్తాయి. స్పితివ్యాలీకి వెళ్లినప్పుడు అక్కడ హోటళ్లు ఖాళీ లేవు. అక్కడ నా పరిస్థితి గమనించిన స్థానిక కుటుంబం వారింట్లో ఉండమని ఆహ్వానించింది. వర్షంలా కురుస్తోన్న మంచులో వారింట ఆతిథ్యం ఎప్పటికీ మరిచిపోలేనిది. అయితే దీనికి భిన్నంగా అక్కడే మరో భయంకర అనుభవమూ తోడైంది. అక్కడి నుంచి లాంగ్జా అనే ప్రాంతానికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నా. దారిలో అతడు డ్రగ్స్ తీసుకున్నాడు. మంచు కరిగిన ఆ రహదారుల్లో అతడి డ్రైవింగ్‌తో నా ప్రాణాలే పోతాయనుకున్నా. అదృష్టవశాత్తూ ఎలాగోలా నా గమ్యానికి చేరుకున్నా.