Steel Bridge in Hyderabad : హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాహనదారులపై ఆ భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం అనేక చోట్ల వంతెనల నిర్మాణాలను చేపడుతూ వస్తుంది. ఆ కోవలోకి చెందిందే ఈ వంతెన. కానీ, ఇది చాలా ప్రత్యేకం. కారణం ఇది ఉక్కు వంతెన. కాంక్రీట్ బ్రిడ్జిలకు ప్రత్నామ్నాయంగా ఉండే. ఈ బ్రిడ్జిని పూర్తిగా స్టీల్‌తోనే నిర్మించారు. ఫలితంగా దక్షిణ భారతదేశంలోనే రహదారిపై నిర్మించిన అతి పొడవైన మొదటి ఉక్కు వంతెనగా నిలుస్తుంది.
Steel bridge Between Indirapark to VST : దీనిని నగర నడిబొడ్డున ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని.. వీఎస్టీ వరకు (Indirapark to VST) 2.6 కిలోమీటర్లు నిర్మించారు. నిత్యం రద్దీగా ఉండే ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్, సినిమా థియేటర్లకు నెలవైన ఆర్టీసీ క్రాస్‌రోడ్డుతో పాటు.. విద్యానగర్ రోడ్డు మీదుగా వీఎస్టీ వరకు ఇక ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఈ మార్గంలో 30 నిమిషాలకు పైగా సాగే ప్రయాణం వంతెన నిర్మాణంతో 5 నిమిషాల్లోపే వెళ్లొచ్చని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
జీహెచ్ఎంసీ రూ.30,000 కోట్ల అంచనా వ్యయంతో.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా నగరంలో పై వంతెనలు, అండర్ పాస్‌లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీలు వంటి 32 నిర్మాణాలు పూర్తిచేసింది. అయితే, ఆ వంతెనలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. రహదారిపై నుంచి 26.54 మీటర్ల ఎత్తులో ఈ ఉక్కు వంతెనను నిర్మించారు. ఈ ఉక్కు వంతెన 33వ ప్రాజెక్టుగా అందుబాటులోకి రాబోతుంది.
ప్రతిపాదిత ప్రాంతంలో రహదారి ఇరుకుగా ఉండటంతో స్టీల్ బ్రిడ్జి (Steel Bridge ) ఉత్తమమని ఇంజినీర్ల బృందం అభిప్రాయపడింది. అదనంగా భూమిని సేకరిస్తే.. వందల భవనాలు కూల్చాల్సి వచ్చేది. వేల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది. దీంతో ఉక్కు వంతెన వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణ పనులకు 2020 జూలై 10న శంకుస్థాపన జరగగా.. సాంకేతిక కారణాలతో 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్‌లోని మెట్రోరైలు పై భాగాన నిర్మితమైన మొదటి వంతెన కావడం మరో ప్రత్యేకత. ఈ స్టీల్ వంతెనను 4 లైన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి 12,316మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఉక్కు వంతెనలో 81 స్టీల్ పిల్లర్లు, 426 దూలాలు నిర్మించినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఈ ఉక్కు వంతెన ఏర్పాటు వల్ల.. వాహనదారులకు వ్యయప్రయాసలను తగ్గించగలదని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెబుతున్నారు.