Krishna water dispute: కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 తీర్పు అమలుపై భాగస్వామ్య రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. అది అమల్లోకి వస్తే బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం క్యారీ ఓవర్ కింద చేసిన కేటాయింపులు కూడా దక్కే పరిస్థితి ఉండదని తెలంగాణ పేర్కొనగా, అమలుకు అనుమతించాలని కర్ణాటక కోరింది.
ఏమిటీ వివాదం
కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 నవంబరు, 2013న తుది తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం తుదితీర్పును కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో(నోటిఫై చేయకుండా) ప్రచురించకుండా స్టే ఇచ్చింది. పునర్విభజన తర్వాత తెలంగాణ కూడా ఇందులో భాగస్వామి అయింది. అప్పట్నుంచి దీనిపై వాయిదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కర్ణాటక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి నీటిని వినియోగించుకునేలా గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాలని కోరింది. దీనికి మహారాష్ట్ర సానుకూలంగా వ్యవహరించగా, తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ నెల 13న విచారిస్తామని, ఆలోపు కేంద్రం సహా నాలుగు రాష్ట్రాలు తమ వాదనలను సమర్పించాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఈ నెల 10న తెలంగాణ, 11న కర్ణాటక, మహారాష్ట్ర, శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ తమ వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించాయి. కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు ఇంకా సమర్పించలేదని తెలిసింది. ఆయా రాష్ట్రాల వాదనలు ఇలా..
సమగ్ర అధ్యయనం అవసరం: తెలంగాణ
‘‘బచావత్ ట్రైబ్యునల్ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీలు పంపిణీ చేసింది. దిగువనున్న తమ రాష్ట్రానికి 25 సంవత్సరాలు కేటాయించిన నీటికన్నా తక్కువ లభ్యత ఉంటుంది కనుక క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 65 శాతం నీటి లభ్యత కింద ఎగువ రాష్ట్రాలకు కేటాయింపులు చేసిన తర్వాత క్యారీ ఓవర్‌కు 30 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత కింద ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత 120 టీఎంసీలు కేటాయించింది. వాస్తవానికి ఈ పద్ధతిలో క్యారీ ఓవర్ కింద నీటి వినియోగం సాధ్యంకాదు. కాబట్టి ట్రైబ్యునల్ తీర్పులో మార్పులు చేయాలి. తీర్పును నోటిఫై చేయకముందే కర్ణాటక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఆ మేరకు నీటిని వాడుకుంటోంది. 75 శాతం నీటి లభ్యతకు మించి ఆ రాష్ట్రం వాడుకోవడంతో తాము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉంది. కాబట్టి తీర్పును నోటిఫై చెయ్యొద్దని కోరుతున్నాం’’ అంటూ తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వేతోపాటు సి.ఎస్.వైద్యనాథన్, కె.రామకృష్ణారెడ్డి వాదనలు దాఖలు చేశారు.
అత్యవసరంగా నోటిఫై చేయాలి: కర్ణాటక
‘‘కృష్ణా జల వినియోగానికి సంబంధించి మౌలిక వసతుల కోసం రూ.13,321 కోట్లు ఖర్చు చేశాం. ఎగువ కృష్ణా పరిధిలోనే 5.94 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించిన దానిలో(173 టీఎంసీలు) 75 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలి. అలా కాకపోతే మౌలిక వసతుల కోసం చేసిన వ్యయమంతా వృథా అవుతుంది. కేటాయించిన నీటిని వాడుకునేలా గెజిట్‌ను నోటిఫై చేయడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎలాంటి నష్టం జరగదు. 2020 జూన్ నుంచి 75 టీఎంసీల వినియోగానికి అనుమతించాలి. ఈ నీటి వినియోగానికి సంసిద్ధత అవసరం కనుక త్వరగా వాదనలు పూర్తిచేసి తీర్పును నోటిఫై చేయాలి’ అని ఆ రాష్ట్రం వాదనలు దాఖలు చేసింది. మహారాష్ట్ర కూడా కర్ణాటక తరహా వాదననే వ్యక్తంచేసింది.
ఇదీ చదవండి:బూస్టర్ డోసు వేసుకున్నా వదలని 'ఒమిక్రాన్'!