రాష్ట్రంలో రెవెన్యూ విధానంలో సమూల మార్పులకు నాంది పలికిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను ఇప్పటికే తహసీల్దార్లకు అప్పగించింది. గత దశాబ్దకాలంగా స్థిరాస్తి వ్యాపారం, వ్యవసాయేతర అవసరాలకు భూ వినియోగం పెరిగింది. రికార్డుల్లో మాత్రం అవి వ్యవసాయ భూములుగానే చలామణిలో ఉన్నాయి. సుమారు 11.6 లక్షల ఎకరాలు ఇలా మళ్లినట్లు రెవెన్యూ అధికారుల అంచనా. ఈ పరిస్థితిని సరిదిద్ది వినియోగం ప్రాతిపదికనే భూమి విలువ నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ విలువను గ్రామం యూనిట్‌గా కాకుండా గతంలో మాదిరే సర్వే నంబర్ల వారీగా నిర్ణయించనున్నట్లు ప్రకటించింది. దీనిపై రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. విలువైన భూములు, అంతగా విలువలేని భూములకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే ధర ఉండటంతో సమస్యలు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
2010కి ముందు పద్ధతిలోనే..
ఉమ్మడి రాష్ట్రంలో సర్వే నంబర్లవారీగానే భూముల విలువ నిర్ణయించేవారు. 2010 ఆగస్టు నుంచి గ్రామం యూనిట్‌గా ధరలు నిర్ణయించే విధానం వచ్చింది. అప్పట్లో ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో జాయింట్ కలెక్టరు ఛైర్మన్‌గా, స్థానిక సబ్ రిజిస్ట్రారు కన్వీనర్‌గా, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ ఛైర్మన్‌గా, సబ్‌రిజిస్ట్రార్ కన్వీనర్‌గా కమిటీలను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఆ కమిటీలను పునర్‌వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కొత్త కమిటీల ఆధ్వర్యంలో విలువను నిర్ణయిస్తారు. గృహాలు, వాణిజ్య భవనాలను ఇంటి నంబర్ల ఆధారంగా విలువను నిర్ధారించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.