State VS central: అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ అధికారులతో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్, ఇతర ఉన్నతాధికారులు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల విడుదల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ నమూనా తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి బీఆర్కే భవన్ నుంచి సమీక్షకు హాజరయ్యారు.
ఎఫ్ఆర్బీఎఫ్ పరిమితులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేషన్ల ద్వారా అప్పులు తీసుకొని రాష్ట్రాల నిధుల నుంచి చెల్లిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ అన్నారు. దీంతో అటువంటి రుణాలను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రుణాలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. మూలధన వ్యయం కోసం 2020-21 నుంచి కేంద్రం రాష్ట్రాలకు రుణాల రూపంలో ఇస్తున్న మొత్తం కూడా ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలోకి రాదని కేంద్రం తెలిపిందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మూలధన వ్యయానికి సంబంధించినవన్న ఆయన... కాళేశ్వరం, మిషన్ భగీరథ, జలవనరుల సదుపాయాల అభివృద్ధి కార్పోరేషన్లు అందులో ప్రధానంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తైతే తప్ప రుణాలను తిరిగి చెల్లించే స్థితికి ఆయా కార్పోరేషన్లు రావని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్సీడీసీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని తెలిపారు. కొన్ని అప్పులను ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం లాంటి వివక్షాపూరిత చర్యలు తగవని రామకృష్ణారావు అన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేందుకు కార్పోరేషన్ల ద్వారా నిధులు సమీకరించుకున్న తెలంగాణ కొద్దికాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్రానికి వివరించారు.