తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈసారైనా.. కనికరిస్తారా లేదా పాత పాటే పాడతారా'

రాష్ట్రంపై కేంద్రం ఈ సారైనా కనికరిస్తుందా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రానికి అవసరమైన తోడ్పాటుతో పాటు విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరుతోంది. గత ఐదు బడ్జెట్​లలో రాష్ట్రానికి అదనంగా ఏమీ రాలేదు. ఇవాళ ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లోనైనా రాష్ట్రానికి అదనంగా ఏమైనా దక్కుతాయో... లేదో... చూడాలి.

State government depends on central budget
'ఈసారైనా.. కనుకరిస్తారా లేదా పాత పాటే పాడతారా'

By

Published : Feb 1, 2020, 5:28 AM IST

Updated : Feb 1, 2020, 7:28 AM IST

'ఈసారైనా.. కనికరిస్తారా లేదా పాత పాటే పాడతారా'

ఆంధ్రప్రదేశ్​ విభజన చట్టంలోని హామీల అమలుతో పాటు కొత్త రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచి కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు చొరవ తీసుకొని నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తులు చేస్తూనే ఉంది.

ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా..

గిరిజన విశ్వవిద్యాలయానికి గతంలో నిధులు కేటాయించినప్పటికీ అది చాలా తక్కువ మాత్రమే. వీటితో పాటు కొత్త రాష్ట్రమైన తెలంగాణకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కూడా రాష్ట్రం కోరింది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ.. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది.

అదనంగా ఏమి రాలేదు..

రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా నిధులు సమకూర్చుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసింది. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కోరింది. మిషన్ కాకతీయ సహా ఇతర పథకాలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరినా.. ఇప్పటికీ కేంద్రం నుంచి నిధులు రాలేదు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లు తప్ప అదనంగా ఏమీ రాలేదు.

నీతి ఆయోగ్ సిఫారసు చేసినా..

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కోసం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ ఫలితం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పూర్తైన నేపథ్యంలో వాటి నిర్వహణకు రూ.54వేల కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు 15వ ఆర్థిక సంఘానికి వినతిపత్రం అందించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేస్తున్న నేపథ్యంలో మిషన్ భగీరథ నిర్వహణకు ఆ నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

ఈసారి ఎలా ఉంటుందో..

ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని కూడా రాష్ట్ర సర్కారు గతంలోనే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. గత ఐదు బడ్జెట్లలోనూ కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ విదల్చలేదనే చెప్పుకోవచ్చు. ఈ మారైనా ఏమైనా అవకాశం ఉందో లేదో... కేంద్ర బడ్జెట్ ద్వారా తేలనుంది.

ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..

Last Updated : Feb 1, 2020, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details