ఈనెల 11న జరగనున్న జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు జారీ చేసిన విప్ ఉల్లంఘిస్తే.. వారు పదవిని కోల్పోతారని.. వారు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటవుతుందని వెల్లడించారు. 11న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుందని... ప్రమాణం చేసిన వారికి మాత్రమే మధ్యాహ్నం 12.30కు జరిగే ప్రత్యేక సమావేశం, ఓటు వేసేందుకు అర్హత ఉంటుందని తెలిపారు.
ఎన్నికైన కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఎక్స్ అఫీసియో సభ్యులకు ఓటుహక్కు ఉంటుందని... చేతులెత్తడం ద్వారా ఈ ఓటింగ్ జరుగుతుందని వివరించారు. ఓటు హక్కు కల్గిన సభ్యుల్లో కనీసం సగం మందితో కోరం ఉంటేనే ఎన్నిక జరుగుతుందని... నిర్ణీత సమయానికి సరిపోయే సంఖ్యలో సభ్యులు హాజరైతే వెంటనే ఎన్నిక నిర్వహిస్తారు.