తెలంగాణ

telangana

ETV Bharat / state

బల్దియా పోలింగ్​కు ఏర్పాట్లు.. ఆన్​లైన్​లో నామపత్రాలు - ghmc polling arrangements

బల్దియా ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి తెలిపారు. నామినేషన్ పత్రాలు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా.. పోలింగ్ నిర్వహిస్తామని ఎస్​ఈసీ స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

state election commissioner partha sarathi
బల్దియా పోలింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు

By

Published : Nov 17, 2020, 2:31 PM IST

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి పార్ధసారథి తెలిపారు. నామినేషన్‌ వేసేందుకు అవసరమైన పత్రాలన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచామన్నారు. దీనివల్ల అభ్యర్థులు గందరగోళానికి గురవకుండా ఉంటారని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో వరద బాధితులకు సాయం చేయొచ్చని.. ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ఆర్థిక సాయం బాధితులకు నేరుగా కాకుండా ఖాతాల్లో కూడా వేయొచ్చని సూచించారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా..

జీహెచ్​ఎంసీ ఎన్నికల నిర్వహణ విధివిధానాలు వివరించిన పార్థసారథి.. కొవిడ్‌ మార్గదర్శకాలు అనుసరించి పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నలుగురు సిబ్బంది ఉంటారని, మొత్తం 55 వేలమంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో 14 వందల 39 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 1004 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. బందోబస్తు కోసం 25 వేల నుంచి 30 వేలమంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు పార్థసారథి తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఖర్చు చూపించకపోతే.. అనర్హత వేటు

2009 జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 42.04 శాతం పోలింగ్ నమోదవగా.. 2014లో 45.29 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి పోలింగ్ శాతం పెరిగేలా.. ఓటర్లకు అవగాహన కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి వివరించారు. ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయం 5 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫలితాలు వచ్చాక 45 రోజుల్లో ఎన్నికల ఖర్చులు చూపించాలని, లేనియెడల అభ్యర్థులపై మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. బీసీ, ఎస్​టీ, ఎస్సీ అభ్యర్థులకు 2 వేల 5 వందలు , ఇతరులకు 5 వేలు డిపాజిట్‌గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి నామినేషన్ల పత్రాలు ఆన్‌లైన్‌నే తీసుకోవచ్చని పార్థసారధి చెప్పారు.

9,248 పోలింగ్ కేంద్రాలు

జీహెచ్​ఎంసీలో 150 వార్డులు ఉండగా.. 74 లక్షల 4వేల 2వందల 86 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 38లక్షల 56వేల 770 మంది... మహిళలు 35లక్షల 46వేల 847మంది ఉన్నారు. ఇతరులు 669మంది ఉన్నారు. ఎన్నికల కోసం ముసాయిదా ప్రకారం 9వేల 248 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జీహెచ్​ఎంసీలో 79 వేల 290 మంది ఓటర్లతో మైలార్ దేవ్ పల్లి పెద్ద డివిజన్‌గా ఉండగా.. 27 వేల 948 మంది ఓటర్లతో రామచంద్రాపురం చిన్న డివిజన్‌గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details