పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అదనపు డీజీ జితేందర్, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో సీఈఓ హైదరాబాద్ బుద్దభవన్ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
జంబో బ్యాలెట్ బాక్సులు...
పోలింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్న శశాంక్... ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తైనట్లు చెప్పారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో చోట వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఇతర కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, ఇతరాల ద్వారా వీడియోగ్రఫీ చేయిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బ్యాలెట్ పత్రాలు భారీ సైజులో ఉన్నాయని... ఇందుకోసం జంబో బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రానికి ఒకటి చొప్పున, పదిశాతం అదనంగా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
క్రిమినల్ చర్యలు...
ముందు జాగ్రత్తగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒకటి లేదా రెండు పెద్ద బ్యాలెట్ బాక్సులను కూడా ఇస్తున్నట్లు సీఈఓ తెలిపారు. పోలింగ్ రోజు అభ్యర్థికి ఇప్పటికే అనుమతించిన రెండు వాహనాలకు తోడు అదనంగా ప్రతి జిల్లాకు మరో వాహనం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శశాంక్ గోయల్ తెలిపారు.