ఫిబ్రవరి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ కసరత్తును వేగవంతం చేసింది. పద్దు ప్రతిపాదనలను వాస్తవాల మేరకు రూపొందించి అందజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలను ఆదేశించింది. ఇప్పటికే కొన్ని శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలు అందజేశాయి. ఇంకా ప్రతిపాదనలు పంపని శాఖలు వీలైనతం తొందరలో అందజేయాలని ఆర్థిక శాఖ సూచించింది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థికశాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా వాస్తవికతతో ప్రతిపాదనలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. శాఖాధిపతులను ఆదేశించారు.
గతేడాది 1.46 లక్షల కోట్లు:
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ తొమ్మిదిన 1.46 లక్షల కోట్లతో బడ్జెట్ను తీసుకువచ్చింది. అంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 1.82 లక్షలతో ప్రవేశపెట్టింది. ఆర్థిక మాంద్యం ప్రభావం, రాబడుల్లో తగ్గుదల, కేంద్ర పన్నుల వాటా తగ్గడం సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 1.46 లక్షల కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కూడా వాస్తవిక బడ్జెట్ను రూపొందిస్తున్నారు.
కేంద్ర పన్నుల వాటా ప్రధానంగా పరిగణలోకి..
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కోతలేకుండా ఆ పథకాల అవసరాలకు పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు ఉండేలా ప్రతిపాదనలు అందించాలని సూచించారు. కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై సమగ్రంగా శాఖల్లో చర్చించి ప్రాధాన్యం మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కొనసాగుతున్న పనుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర పన్నుల వాటా రాకపోవడం, జీఎస్టీ రాబడులు తగ్గడం అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కసరత్తు చేస్తున్నారు.
మంత్రుల ఆమోదం తప్పనిసరి:
పద్దులు రూపొందించేటప్పుడు సంబంధిత మంత్రితో చర్చించి వారి ఆమోదం తీసుకోవాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో రోజుకి రెండు విభాగాలతో కలిసి సమగ్ర సమావేశం నిర్వహించి తుది అంచనాలు ఖరారు చేయనున్నారు. భారీ వ్యయంతో ఉండే కొత్త పనులను పరిగణలోకి తీసుకోకుండా.. నిర్మాణంలో ఉన్న వాటి బిల్లులు రూపొందించి పంపించే విధంగా ఆయా శాఖలు రూపకల్పన చేస్తున్నాయి.
ఇవీ చూడండి: క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం