Kodi Pandalu in Andhra Pradesh: సాధారణ రోజుల్లో కొక్కొరోకో అని ప్రజల్ని కోడి నిద్ర లేపుతుంది.. కానీ ఇప్పుడు పందేనికి రమ్మంటోంది. కాలికి కత్తి కట్టుకుని, రెక్కలు చాచిపెట్టి సమరానికి సిద్ధమంటోంది. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందెం రాయుళ్లకు వేళయింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో సాగే ఈ తతంగాన్ని చూస్తూ యంత్రాంగం మిన్నకుండిపోతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఊరూరా కోడిపందేల బరులను ఏర్పాటు చేశారు. దీంతోపాటు గుండాట, కోతముక్క లాంటి జూదాల కోసం నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలకు మించి పందేలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాపట్ల జిల్లా ఈపూరులో శుక్రవారం నుంచే ఫ్లడ్లైట్లు పెట్టి మరీ పందేలు వేస్తున్నారు. కోడి కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించడం చట్టవిరుద్ధమని న్యాయస్థానాలు, పోలీసుశాఖ హెచ్చరిస్తునే ఉన్నాయి. అది పట్టించుకోకుండా.. అధికారపార్టీ అండదండాలతో బరులు వేసిన నిర్వాహకులు ససేమిరా అంటున్నారు.
రాష్ట్ర స్థాయి కోడి పందేలకు ఏర్పాట్లు :కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలో రాష్ట్రస్థాయిలో కోడి పందేల కోసం బరి ఏర్పాటు చేశారు. కాకినాడ నగరం, గ్రామీణం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం వంటి మండలాల్లోనూ పందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో రూ.500 కోట్లకు పైనే జూదం రూపంలో ప్రతి సంవత్సరం చేతులు మారుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు, వీరవాసరం, యలమంచిలి, నరసాపురం, ఆచంట తదితర మండలాల్లో.. ఏలూరు జిల్లాలో చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పెదవేగి, దెందులూరు, కైకలూరు తదితర మండలాల్లోనూ కోడిపందేలు, ఇతర జూదక్రీడలకు సర్వం సిద్ధం చేశారు. ఈ రెండు జిల్లాల్లో రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకూ చేతులు మారే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. భీమవరం,
నరసాపురం ప్రాంతాల్లో పందేలు ఆడాటానికి, వీక్షించటానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలామంది చేరుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పంచాయతీ కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలను కోడి పందెంతో (కత్తి కట్టకుండా) చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు.