తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2022, 7:18 AM IST

ETV Bharat / state

Ugadi 2022 Special: ఉగాది రోజున ఏం చేయాలి? పచ్చడి ఎందుకు తినాలి?

Ugadi 2022 Special: తెలుగువారికి కొత్త సంవత్సరాది.. ఉగాది. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకొంటారు. ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే జన్మ, నక్షత్ర గమనం అని అర్థం. వీటికి ఆది అనగా.. నక్షత్ర గమనం మొదలుకావడం, జన్మకు మొదలు అని అర్థాలు. ఉగాది అంటే యుగమునకు ఆది.. నక్షత్రమునకు ఆది అని కూడా అర్థం.

Ugadi 2022 Special:
ఉగాది రోజున ఏం చేయాలి? పచ్చడి ఎందుకు తినాలి?

Ugadi 2022 Special: ఉగాది అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటి రోజు అని ఒక అర్థం. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట అని అర్థం. మన భారతీయ సంప్రదాయం ప్రకారం యుగమునకు ఆది కాబట్టి.. ఉగాది అని, సకల రుతువులకు చైత్రం ఆది గనక చైత్రమాసంలో వచ్చిన ఉగాది అని అంటాం. చైత్ర శుక్లపాడ్యమి అనగా.. ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. మన పురాణాల్లో వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతార ధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునే ఉగాదిగా ఆచరణలోకి వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి.

చైత్ర శుక్లపాడ్యమి రోజున బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించినట్టుగా పురాణాలు తెలుపుటచే ఈ రోజు ఉగాదిని జరుపుకొంటాం. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలి వాహన యుగకర్తగా భాసిల్లిన కారణంతో ఆయనకు స్మృతిగా ఉగాది ఆచరించబడటం చారిత్రక వృత్తాంతం.

ఉగాది రోజున ఏం చేయాలి?

  • ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కనీస ధర్మంగా ఆచరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే?
  • తెల్లవారు జామునే నిద్ర లేవడం. ఇంటిని శుభ్రపరుచుకోవడం, మామిడి తోరణాలతో అలంకరించడం చేయాలి.
  • తలస్నానం ఆచరించాలి; కొత్త బట్టలు ధరించాలి.
  • ఇంట్లో గానీ, దేవాలయంలో గానీ భగవంతుడిని ఆరాధించాలి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లలితా స్తోత్రం, అష్టోత్తర శతనామములు వంటివి పఠించడం మంచిది.
  • పెద్దల ఆశీస్సులు తీసుకోవడం
  • ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించడం
  • పంచాంగ శ్రవణం చేయడం (దేశ కాల పరిస్థితులను గురించి తెలుసుకోవడం)

ఉగాది పచ్చడి ఎందుకు తినాలి?

story on Ugadi Festival ఉగాది ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచులు అంటే ఆరు రుచుల సమ్మేళనం. ఇది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో చేదు, కారం, తీపి, ఉప్పు, పులుపు, వగరు అనే ఈ ఆరు రుచులతో చేసే పచ్చడిలో శాస్త్రీయ, ఆధ్యాత్మికత మేళవించి ఉండటం విశేషం. ఈ షడ్రుచులు మన జీవితంలో ఆరు రకాలైన ఎలాంటి రుచులున్నాయో వాటి ప్రతిరూపంగా, మానవుని జీవితంలో కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ ఇలాంటివన్నీ సర్వసాధారణమని, అన్నింటినీ సమానంగా స్వీకరించి జీవితంలో ముందుకు సాగాలని చెప్పే ఆధ్యాత్మిక భావన ఉగాది పచ్చడిలోని అర్థం. ఇదేకాకుండా ఉగాది పచ్చడి చైత్రమాసంలో తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న క్రిములు, చెడు బ్యాక్టీరియా నశిస్తాయని, ఆరోగ్యపరంగా శరీరానికి మంచి చేస్తుందని సైన్స్‌ తెలియజేస్తుంది.

పంచాంగ శ్రవణం ఎందుకు?

ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరి పనుల గురించి వారే ఎక్కువగా ఆలోచించే పరిస్థితి. మన పూర్వీకులు ఏ పనిచేసినా సమాజం కోసం, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేశారనడానికి ఈ ఉగాది పర్వదినమే సరైన ఉదాహరణగా చెప్పొచ్చు. పంచాంగ శ్రవణం చేయడం వల్ల దేశ కాలమాన పరిస్థితులు తెలుస్తాయి. అలాగే, ప్రతి ఒక్కరికీ రాబోయే పరిస్థితులపై అవగాహన వస్తుంది. మంచి జరిగిన వారు భగవంతుడు దాన్ని తనకు ఇచ్చిన ఓ మంచి అవకాశంగా భావించడం.. చెడుగా ఉన్నట్టయితే గ్రహస్థితి ఉన్నందున రాబోయే కాలంలో మంచి జరుగుతుందనే ఆశతో జాగ్రత్తగా ఉండటం చేస్తుంటారు. సానుకూల దృక్పథంతో ఆలోచనా ధోరణి, విలువలను పంచాంగ శ్రవణం ద్వారా పెద్దలు అందజేశారు. జ్యోతిషాన్ని సానుకూల దృక్పథంగానే చూడాలి తప్ప వ్యాపార ధోరణి, ప్రతికూల ధోరణిలో చూడకూడదు. పంచాంగ శ్రవణంలో ఏవైనా కష్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు దాన్ని ఎలా తట్టుకొని ముందుకెళ్లాలో ప్రోత్సహించేదే పంచాంగ శ్రవణం.

ఇదీ చూడండి: వచ్చెను ఉగాది.. తెచ్చెను వసంతం!!

ABOUT THE AUTHOR

...view details