Shravana Masam 2022:‘వర్షం స్థానం విదుం ప్రాజ్ఞం ఇమం లోకం చ భారత’ అన్నాడు మహాకవి భారవి. సకాల వర్షాలతో, పండితులతో మనదేశం మహోన్నతంగా ఉందనేది ఆయన నిర్వచనం. ఆ ఐశ్వర్యాలతోపాటు ఆరోగ్య వైభవాలను, శుభ కర్మ ఫలాలను ప్రసాదిస్తుంది శ్రావణం. శ్రావణలక్ష్మిని ఆహ్వానించడానికే అన్నట్లు పుడమిపీఠాన్ని కడిగి శుభ్రం చేస్తుంది వర్షమాత. సస్య సంపదలివ్వమంటూ స్వాగతం పలుకుతుంది మహీతలం. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి ఆవిర్భవించిన శ్రావణం గడప గడపకూ పండగే. శ్రావణ సోమవారం, రక్షపౌర్ణమి, నాగుల పంచమి, దామోదర ద్వాదశి, కృష్ణాష్టమి వంటి ఎన్నెన్నో పండగలు. పూజలు, పేరంటాలు, వాయన దానాలతో సాంప్రదాయ కళను మోసుకొస్తుంది.
మూలాల్లోకి వెళ్తే పూర్వ గాథలేవైనా ముల్లోకాలకు సంచరించి, బ్రహ్మ, ఈశ్వరులకు వారివారి మనఃస్థితులను బట్టి శాపమిచ్చి వైకుంఠానికి వెళ్తాడు భృగుమహర్షి. లక్ష్మి కొంగు విడవక క్రీడాసక్తుడై ఉన్న శేషశాయి, భృగు రాకను గమనించి సగౌరవంగా ఆహ్వానించేలోపే విష్ణు వక్షస్థలంపై ఎడమకాలితో తన్ని మరీ తన కోపాన్ని ప్రకటిస్తాడు రుషి. తన తప్పిదాన్ని మన్నించమంటూ వేడుకుంటాడు విష్ణువు. లోకకల్యాణార్థం రుషి శాపాన్ని స్వీకరిస్తాడు హరి. తన నివాస స్థానాన్ని అగౌరవపరచిన చోట క్షణం కూడా నిలవలేనంటూ కదిలి వెళ్లిపోతున్న సిరిని అడ్డగించాడు విష్ణువు. తన కోసం భువికి రమ్మని చెప్పి కదిలింది లక్ష్మి. ఖిన్నుడైన శ్రీనివాసుడు చిన్నబోయాడు. అది చూసిన భృగు మహర్షి ఆలుమగలను వేరుచేశానంటూ పశ్చాత్తాపం చెందాడు. బదరికావనంలో వ్యూహలక్ష్మీ మంత్ర సాధనతో తనను తాను పునీతం చేసుకునేందుకు యత్నించాడు. కరుణాలవాల కమల కరిగిపోయి రుషి ఎదుట సాక్షాత్కరించింది. తప్పు తెలుసుకున్నాననీ, లక్ష్మీనారాయణుల పునస్సంధాన భాగ్యాన్ని తనకు అనుగ్రహించమని, కూతురిగా పుట్టమని ప్రార్థించాడు. అంగీకరించిన లక్ష్మి భృగు దంపతులకు, శ్రావణంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు తన దివ్య మంగళ రూపంతో భార్గవిగా అవతరించింది. వేంకటేశుని చేరి వ్యూహలక్ష్మిగా తన స్థానాన్ని చేపట్టింది. అడిగిన వరాలనందించిన వరలక్ష్మిగా నాడు భృగుమహర్షి ఆరాధించిన విధానమే నేటి వరలక్ష్మీ వ్రతం.
సున్నిత మనస్కురాలైన శ్రీమహాలక్ష్మికి, తన విధులను శ్రద్ధగా నిర్వర్తించే వారంటే ప్రీతి ఎక్కువ. అందుకేనేమో తనను ఆరాధించడంతో పాటు సాధ్విగా తన గృహ ధర్మాలను ఆచరిస్తూ ప్రశాంతచిత్తురాలైన చారుమతికి కలలో సాక్షాత్కరించి, వరలక్ష్మీ వ్రతాన్ని తోటివారితో కలిసి ఆచరించమంది.
శ్రావణలక్ష్మికి అభేదాన్ని పాటిస్తూ సర్వమంగళకారిణిగా భరోసానిస్తుంది మంగళగౌరి. గయలో వెలసిన మంగళగౌరిని హరిసోదరి నారాయణిగా కీర్తించటం ఆనవాయితీ. సాక్షాత్తూ ద్రౌపదీదేవి తన సౌభాగ్య రక్షణకై యోచిస్తునప్పుడు శ్రీకృష్ణుడు సూచించిన వ్రతమే మంగళగౌరీవ్రతమని పురాణోక్తి. సాధారణంగా కొత్తగా పెళ్లైన ఆడపిల్లలతో అన్యోన్య దాంపత్యం కోసం జరిపించే వ్రతమిది. జ్యోతిశ్శాస్త్ర రీత్యా చెడు గ్రహంగా భావించే కుజగ్రహ వారమైన మంగళ వారాన్ని శ్రావణంలో సర్వ మంగళప్రదమైన దినంగా మార్చిన ఘనత ఈ వ్రతానిదే. పరిపూర్ణ విశ్వాసంతో, తల్లితోపాటు మంగళగౌరీ వ్రతం చేస్తుంది రాజకుమారి. విధివశాత్తూ అల్పాయుష్కుడైన భర్తకు రాబోయే ఆపదనూ, పరిష్కార మార్గాన్నీ గౌరీమాతే సూచిస్తుంది. దాన్ని పాటించిన రాజకుమారి సకల సౌభాగ్యాలనూ అందుకోవటమే కథ.