తెలంగాణ

telangana

ETV Bharat / state

20వేల మంది ఒక్కటై... నదిని బతికించుకున్నారు! - Palar River Rejuvenation Project Latest News

చిత్ర... ఆనంది... గీత... హంసవేణి.. కుముదవల్లి... వీళ్ల ముందు రెండే దారులుండేవి. ఒకటి.. కన్నబిడ్డలను ప్రతిరోజూ ఆకలితో మాడ్చడం రెండు.. ఊరు వదిలి వలస బాటపట్టడం. ఆమాటకొస్తే వేలూరు జిల్లాలోని వేలాది మంది మహిళల పరిస్థితి ఒకప్పుడు ఇదే. కానీ వాళ్ల సంకల్పబలంతో విధిరాతను మార్చుకున్నారు. కనిపించకుండా పోయిన నాగానదికి ప్రాణంపోసి లక్షలాది మందికి ఉపాధిబాట చూపించారు..

special story on palar river rejuvenation
20వేల మంది ఒక్కటై... నదిని బతికించుకున్నారు!

By

Published : Oct 13, 2020, 8:11 AM IST


ఇప్పుడు: ఎటుచూసినా పచ్చని పంట చేలతో..ఆకుపచ్చ చీరని అంచుగా అలంకరించుకుని ఉరకలూ పరుగులతో వడివడిగా ప్రవహిస్తూ... వేలాది మంది రైతన్నలకు అండగా నిలుస్తోంది నాగానది. ఇలా తవ్వుతుంటే అలా గంగమ్మ కనికరిస్తోంది. జలసిరులు కురిపిస్తోంది. ఫలితంగా వేలాది గ్రామాలు కరవు నుంచి బయటపడి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదుటపడుతూ, పిల్లలని చదివించుకుంటున్నాయి.

అప్పుడు:ఐదేళ్ల క్రితం అసలు ఈ నది ఆనవాళ్లే లేవంటే నమ్ముతారా? అవును... తమిళనాడులోని వేలూరు, తిరువణ్నామలై జిల్లాల మీదుగా నాగానది ప్రవహిస్తుందని పెద్దలు చెబితే వినడమే కానీ ఈ తరానికి ఆ నదిని నిండుగా ప్రవహిస్తుంటే చూసిన జ్ఞాపకమే లేదు. విచ్చలవిడిగా బోర్లువేసి తన గుండెల్లో తడిని పూర్తిగా పిండేయడంతో ఎండిపోయింది నాగానది. దానికితోడు వర్షాభావ పరిస్థితులు. ఫలితం... కరవు తాండవించడం మొదలుపెట్టింది. ఏళ్లపాటు పంటలు లేవు, తిండి లేదు. దాంతో మూడింట రెండు కుటుంబాలు వలసబాట పట్టాయి. ఉన్న కుటుంబాల్లో మగవాళ్లు నాటుసారాకి బానిసలై బలైపోతుంటే.. బిడ్డలను ఏం పెట్టి పోషించుకోవాలో తెలియని పరిస్థితి ఆడవాళ్లది.

అలాంటి సమయంలో ఆర్ట్‌ఆఫ్‌లివింగ్‌ సంస్థ ‘పాలార్‌ రివర్‌ రెజువనేషన్‌ ప్రాజెక్టు’ పేరుతో చేసిన ఓ ఆలోచన వేలూరు జిల్లా మహిళల్లోని చైతన్యాన్ని వెలికితీసింది. పాలార్‌ నదికి నాగానది ప్రధాన ఉపనది. ఒకప్పుడు వేలూరు ప్రాంతం సిరిసంపదలతో విలసిల్లడానికి కారణమైన ఈ నది 15 ఏళ్ల కిందటే ఒట్టిపోయింది. టొమాటో, వేరుసెనగ, అరటి వంటి పంటలు పండించే సామర్థ్యం ఉన్నా నీటి సదుపాయంలేక పొలాల్ని బీడుభూములుగా వదిలేశారు రైతులు. అదే నదిని మహిళల సాయంతో తిరిగి బతికించే ప్రయత్నం చేసింది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌.

మహిళా దండు... ఒక నదిని తిరిగి బతికించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. పక్కా ప్రణాళిక ఉండాలి. అన్నింటికీ మించి ప్రకృతిని మెప్పించే ఓర్పు, సహనం, సంకల్పబలం కూడా కావాలి. ఆ సంకల్ప బలం వేలూరు జిల్లా మహిళల్లో నిండుగా ఉందని గ్రహించిన ఆర్ట్‌ఆఫ్‌లివింగ్‌ ఆ పనిని వాళ్లకే అప్పగించింది. కర్ణాటకలోని వేదవతి, కుముదవతి నదులని పునరుజ్జీవింపజేసిన అనుభవంతో ఆ సంస్థ వేలూరులో పక్కాగా అడుగులు వేసింది. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, రైతులు, రిమోట్‌ సెన్సింగ్‌, జియో- హైడ్రాలజీ నిపుణులు, మహిళల్ని కలుపుకొని ముందుకు నడిచింది. అయితే వీళ్లందరిలో మహిళలదే పైచేయి. ప్రభుత్వాలు, నిపుణులు దిశానిర్దేశం చేశాక... ఆ పనిని తమ భుజాలకెత్తుకుందీ, చివరివరకూ నడిపించిందీ మహిళలే. వేలూరులోని కమ్మవానిపేటలో పైలట్‌గా ప్రారంభమయిందీ ప్రాజెక్టు. అక్కడ నుంచి మొదలై 19 పంచాయతీల్లో నాలుగు వేలకుపైగా నిర్మించిన రీఛార్జ్‌వెల్స్‌, చెక్‌ బండ్స్‌, కరకట్టలు వంటివన్నీ మహిళలు నిర్మించినవే.

వెనక్కి వచ్చారు... వేల గ్రామాలకు జలసిరులను తీసుకురావడంతోపాటూ...ఉపాధి హామీ పథకం ఇచ్చిన భరోసాతో తమ కుటుంబాలనూ ఆర్థికంగా చక్కదిద్దుకున్నారు వేలూరు మహిళలు. ‘నది పొడవునా భూగర్భజలాల్ని పెంచడానికి రీఛార్జ్‌ వెల్స్‌ని 20 అడుగుల లోతుగా తవ్వేవాళ్లం. ఆ బావుల్లో బరువైన సిమెంట్‌ రింగులని అమర్చాల్సి ఉంటుంది. నిజానికి ఈ సిమెంట్‌ రింగులని బయట కొనుక్కోవచ్చు. కానీ మేం అలా చేయలేదు. ఈ పనిని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాం. ఈ సిమెంట్‌ రింగులని బావుల్లో అమర్చడం మొదట్లో మాకు కష్టమయ్యేది. పెద్ద పెద్ద సిమెంట్‌ రింగులకు చుట్టూ తాళ్లు కట్టి వాటిని జాగ్రత్తగా బావుల్లో దింపాలి. వాటి చుట్టూ రాళ్లుపోసి పైన సిమెంట్‌ క్యాపులని అమర్చాలి. వీటిల్లో ఒక్కపని కూడా మేం మగవాళ్లకి అప్పగించలేదు’ అంటోంది ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న కుముదవల్లి. నాలుగేళ్లపాటు సాగిన ఈ ప్రాజెక్టువల్ల సుమారు 20 వేలమంది మహిళలు ఉపాధి హామీ ఇచ్చిన సాయంతో ఆర్థికంగా తమ కుటుంబాలని ఆదుకోగలిగారు. వీళ్లిచ్చిన స్ఫూర్తితో నగరాలు, పట్టణాలకు వలసవెళ్లిన ఎన్నో కుటుంబాలు తిరిగి వచ్చాయి. వీరి శ్రమ వృథా పోలేదు. నదీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ఆరు మీటర్లకుపైగా పెరిగింది. అక్కడితో అయిపోలేదు. ఆ నీటి నిల్వలను కాపాడుకునేందుకు... జామ, రోజ్‌వుడ్‌, మామిడి, ఉసిరి వంటి మొక్కల్ని లక్షల సంఖ్యలో నాటి చుట్టూ పచ్చదనాన్ని పెంచారు. నీటి నిల్వలు పెరగడంతో తిరిగి వ్యవసాయ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు అయిదు వేల గ్రామాల్లో లక్షలాదిమంది ప్రజలు లబ్ధి పొందుతున్నారంటే కారణం వేలూరు మహిళల సంఘటితశక్తే.

ABOUT THE AUTHOR

...view details