తెలంగాణ

telangana

ETV Bharat / state

వృద్ధం శరణం గచ్ఛామి! - old age people special story

వృద్ధాప్యం వద్దనుకుంటే తప్పేది కాదు. రావద్దనుకుంటే ఆగేది కాదు. వయసుతో పాటు ముసలితనమూ మీద పడుతుంది. అనివార్యంగా కొన్ని సమస్యలనూ, ఇబ్బందులనూ మోసుకొస్తుంది. పరిస్థితులను గమనిస్తూ, సరిపెట్టుకుంటూ, అలవాటు చేసుకుంటూ, అంగీకరిస్తూ... వయసును శరణుజొచ్చితే వృద్ధాప్యాన్ని వీలైనంతవరకు హాయిగా ఆస్వాదించొచ్చు.

special story on old age people
వృద్ధం శరణం గచ్ఛామి!

By

Published : Jul 3, 2020, 10:12 PM IST

వృద్ధులంటే ఎవరు? ఏమిటీ ప్రశ్న అని ఆశ్చర్యపోకండి. వయసు మీద పడగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ మూలకు కూర్చొనే రోజులు పోయాయి మరి. జీవన ప్రమాణాలు మెరుగుపడటం.. మంచి వైద్య సదుపాయాలు, చికిత్సలు అందుబాటులోకి రావటం వల్ల ఇప్పుడు ఎంతోమంది మలివయసులోనూ చక్కటి ఆరోగ్యంతో జీవనం గడుపుతున్నారు. ఉద్యోగ విరమణ పొందినా మరో ఉద్యోగంలో కుదురుకుంటున్నారు. లేదూ సొంత పనులు, వ్యాపకాలతో వయసును మరచిపోతున్నారు. అందుకేనేమో ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్వచించిన వృద్ధాప్య ప్రమాణం (65 ఏళ్లు పైబడటం) సైతం చిన్నబోతోంది. చాలామంది ముసలివాళ్లు (ఓల్డ్‌ ఏజ్‌ పీపుల్‌) అని పిలవటానికి ఇష్టపడటం లేదు. పెద్దవాళ్లు (ఎల్డర్లీ) అనే అంటున్నారు. కొందరైతే సున్నితులు (ఫ్రెయిల్‌ పీపుల్‌) అనీ పిలుచుకుంటున్నారు. ఎంత చలాకీగా ఉన్నా పెద్ద వయసులో కొన్ని చిక్కులు తప్పవు. మునుపటి సత్తువ, శక్తి ఉండవు. జ్ఞాపకశక్తీ మందగిస్తుంటుంది. చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తున్నా, తమ పనులు తాము చేసుకోగలుగుతున్నా ఏ చిన్నపాటి సుస్తీ వచ్చినా తట్టుకోలేక బాధపడటం పెద్ద సమస్య. అప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల వంటి సమస్యలతో బాధపడుతుండొచ్చు. అందువల్ల వృద్ధాప్యంలో చికిత్సలు చేయటం కష్టం. ఇబ్బందులు ఎక్కువ. కొన్నిసార్లు ప్రాణాపాయమూ సంభవించొచ్చు. వైద్యులతో పాటు కుటుంబ సభ్యులూ వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోవటం మంచిది.

మార్పులు- ఒకరిలో ఒకోలా

వయసుతో వచ్చే మార్పులు అందరిలో ఒకేలా ఉండవు. కొందరు వయసు వచ్చినా దృఢంగానే ఉంటారు. కొందరిలో కాస్త వయసు మీద పడగానే వృద్ధాప్య ఛాయలు బయటపడుతుంటాయి. జన్యుపరంగానే కాదు, చుట్టుపక్కల పరిసరాల ప్రభావం.. ముఖ్యంగా పేదరికం, పొగ, మద్యం అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ, ఆహారం వంటివన్నీ శరీరం మీద ప్రభావం చూపుతాయి. కాస్త ముందుగానైనా, ఆలస్యంగానైనా అందరిలోనూ కొన్ని మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. అవి..

* జుట్టు నెరవటం, ఊడిపోవటం

* చర్మం ముడతలు పడటం

* వినికిడి తగ్గటం

* మతిమరుపు

* మలబద్ధకం

ఒంటరితనం పెద్ద దిగులు

వృద్ధాప్యంలో అసలైన ఇబ్బంది ఒంటరితనం. ప్రస్తుతం అన్నీ చిన్న కుటుంబాలే. పైగా కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లేవారే. కొడుకు, కోడలు ఉద్యోగాలకో, పనులకో వెళ్లిపోతుంటారు. పిల్లలు బడికి పోతారు. ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్లటం చూస్తూనే ఉన్నాం. దీంతో ఇంట్లో మాట్లాడటానికి, అవసరమైన పనులు చేసిపెట్టటానికి ఎవరూ ఉండకపోవచ్చు. ఈ వయసులో జీవిత భాగస్వామి దూరమైతే ఆ వేదన వర్ణనాతీతం. రోజంతా దిగులుతోనే గడుపుతుంటారు. అందువల్ల పెద్దవాళ్లు తమ వయసు వారితో కలివిడిగా ఉండటం మంచిది. వీలైనప్పుడల్లా నలుగురైదుగురు కలుసుకొని మాట్లాడుకోవాలి. పార్కులోకి వెళ్లి కబుర్లూ చెప్పుకోవచ్చు. ఏదో ఒక వ్యాపకాన్ని పెట్టుకోవాలి. కాలక్షేపానికి అవకాశం కల్పించుకోవాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లో మనవళ్లు, మనవరాళ్లతో ముచ్చట్లు పెట్టటం, కథలు చెప్పటం, ఆడుకోవటం చేయాలి.

తేలికపాటి చికిత్సలే మేలు

పెద్దవారికి ఏమాత్రం సుస్తీ చేసినా తమ పనులు తాము చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అందువల్ల వీళ్లు వీలైనంత త్వరగా ఎవరి పనులు వారు చేసుకునేలా చూడటమే ముఖ్యమని డాక్టర్లు సైతం గుర్తించాలి. కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని వీరికి చికిత్స చేయటం మంచిది.

* పరీక్షలు: వీలైనంతవరకు మూత్ర, రక్త పరీక్ష (టీసీ, డీసీ, హెచ్‌బీ), గ్లూకోజు, క్రియాటినైన్‌ వంటి తేలికపాటి పరీక్షలతోనే చికిత్స చేయాలి. మరీ అవసరమైతే తప్ప బ్రాంకోస్కోపీ, కొలనోస్కోపీ, ఎంఆర్‌ఐ వంటి ఇబ్బందికకరమైన పరీక్షలు చేయరాదు. అవసరమైతే ఎక్స్‌రే తీయొచ్చు.

* మందులు: మరీ శక్తిమంతమైన మందులు ఇవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కువెక్కువ రకాలకు బదులు తేలికపాటి మందులతోనే చికిత్స చేయాలి. ముఖ్యంగా మత్తును కలిగించే మందులు తక్కువ మోతాదులో ఇవ్వాలి. లేకపోతే పొద్దున నిద్ర లేచినప్పుడు తూలి పడిపోయే అవకాశముంది.

ఇబ్బందులు- రకరకాలు

పెద్దవయసులో మరో పెద్ద సమస్య ఇబ్బందుల గురించి చెప్పుకోకపోవటం. ఏదైనా ఇబ్బంది ఉన్నా చాలామంది వయసుతో పాటు వచ్చే మార్పులనే అనుకుంటారు. ఇంట్లో వాళ్లూ తేలికగానే తీసుకుంటుంటారు. పైగా పెద్ద వయసులో జబ్బు లక్షణాలు కాస్త భిన్నంగానూ ఉంటుంటాయి. కొన్నిసార్లు శ్రద్ధ పెట్టి చూస్తే తప్ప జబ్బును గుర్తుపట్టలేం. ఉదాహరణకు- జ్వరం వచ్చినప్పుడు ‘పేలాపన’ (డెరీలియమ్‌) మొదలెడతారు. మునగదీసుకొని పడుకుంటారు. నొప్పీ తెలియకపోవచ్చు. మతిమరుపు మూలంగా బాధను సరిగా చెప్పుకోనూ లేరు. అందువల్ల వీరిని ఓ కంట కనిపెట్టటం, సత్వరం స్పందించటం ముఖ్యం. వృద్ధులను పక్షవాతం, కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల జబ్బుల వంటివి ఎక్కువగా మంచాన పడేలా చేస్తుంటాయి. ఇలాంటి తీవ్ర, దీర్ఘకాల సమస్యలే కాదు, పెద్దగా పట్టించుకోని ఇతరత్రా సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి.

1. పడిపోవటం: దీనికి ప్రధాన కారణాలు- కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, రక్తపోటు తగ్గిపోవటం, చూపు సరిగా కనిపించకపోవటం. 65 ఏళ్ల వయసు దాటిన తర్వాత దాదాపు 30% మంది ఏడాదికి ఒకసారయినా కింద పడుతుంటారు. ఓ 50% మంది తేలికపాటి దెబ్బలతో బయటపడినా 10-20% మందికి తీవ్రమైన దెబ్బలే తగులుతాయి. కాలో, చెయ్యో, పక్కటెముకలో విరుగుతుంటాయి. పెద్ద వయసులో తుంటి విరిగితే సరిగ్గా అతుక్కోవటం కష్టం. చాలామంది దీంతోనే మంచాన పడిపోతుంటారు.

వృద్ధం శరణం గచ్ఛామి!

2. స్పృహ తప్పటం: పెద్దవారు స్పృహ తప్పటం చాలా సాధారణం. ఇది కొద్దిసేపే ఉండొచ్చు గానీ కారణమేంటన్నది తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరిలో ఊపిరి తీసుకోవటం ఆగిపోయి ప్రమాదకరంగా పరిణమించొచ్చు. గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పడిపోవటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గటం, గుండె జబ్బుల వంటివి దీనికి దోహదం చేస్తుండొచ్చు.

వృద్ధం శరణం గచ్ఛామి!

3. తల తిప్పటం: కొందరికి తలను పక్కలకు తిప్పినా, పడుకొని లేచినా, కూర్చొని లేచినా తల తిరుగుతుంటుంది (డిజినెస్‌). దీనినే బినైన్‌ పొజిషనల్‌ వర్టిగో అంటారు. మెడలో వెన్నుపూసల మధ్య డిస్కులు అరగటం (సర్వైకల్‌ స్పాండిలోసిస్‌), మెదడుకు రక్త ప్రసరణ తగ్గటం, పడుకొని లేదా లేచినప్పుడు రక్తపోటు బాగా పడిపోవటం, చెవి లోపలి భాగంలో మార్పులు, మెదడులో కొన్నిరకాల మార్పులు (లకునార్‌ ఇన్‌ఫార్‌క్ట్స్‌), కొన్ని మందుల వంటివి దీనికి దారితీయొచ్చు.

వృద్ధం శరణం గచ్ఛామి!

4. మూత్రం ఆపుకోలేకపోవటం: పెద్దవయసులో మూత్రాశయ కండరాలు అతిగా స్పందిస్తుంటాయి. దీంతో మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. కొందరికి బాత్రూమ్‌కు వెళ్లేలోపే బట్టల్లోనే మూత్రం పడొచ్చు. మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటమూ దీనికి దారితీస్తుంది. ఆడవారిలో.. ముఖ్యంగా కటిభాగం కండరాలు బలహీనమైనవారిలో దగ్గినా, తుమ్మినా బట్టల్లో మూత్రం చుక్కలు పడుతుంటాయి.

వృద్ధం శరణం గచ్ఛామి!

కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

వృద్ధాప్యంలో ఎప్పుడు ఏ సమస్య ముంచుకొస్తుందో తెలియదు. అందువల్ల ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.

* ఇంట్లోంచి బయటకు వెళ్లినప్పుడు తమ పేరు, చిరునామా, టెలిఫోన్‌ నంబరు రాసిన చీటిని వెంట ఉంచుకోవాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవటానికి వీలుగా కుటుంబ సభ్యుల పేర్లు, టెలిఫోన్‌ నంబర్లు కాగితం మీద రాసుకొని జేబులో పెట్టుకోవాలి.

* చేతికర్ర వాడటానికి నామోషీ పడొద్దు. ఏ కొంచెం బలహీనంగా ఉన్నా చేతికర్ర చాలా అవసరం.

* ఎక్కడికి వెళ్లినా ఇంట్లో వాళ్లకు చెప్పి వెళ్లాలి.

* రాత్రి పడుకునే గదిలో మసక దీపం (నైట్‌ ల్యాంప్‌) వెలిగేలా చూసుకోవాలి.

* నిద్ర లేవగానే వెంటనే నిలబడకూడదు. కొద్ది నిమిషాల సేపు కూర్చొని, ఆ తర్వాతే లేవాలి.

* బాత్‌రూమ్‌లో సంప్రదాయ టాయ్‌లెట్‌కు బదులు కమోడ్‌ ఉంటే మంచిది.

* మందులను మరవరాదు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వేసుకోవాల్సిన మందులను విడివిడిగా పెట్టుకోవాలి. వీలైతే వాటి మీద ఎప్పుడు వేసుకోవాలనేది రాసిపెట్టుకోవాలి.

* చిన్నపాటి సుస్తీ చేసినా డాక్టర్‌కు చూపించుకోవాలి. సొంత వైద్యం వద్దు.

* వీలైనంత వరకు పుస్తకాలు, పేపర్లు చదవటం, సంగీతం వినటం, టీవీ చూడటం వంటి వాటితో కాలక్షేపం చేయాలి.

* బాత్రూమ్‌లో బోల్టు, గడియ వేసుకోవద్దు. కొక్కెం లాంటిది ఉంటే మంచిది. లోపల ఉన్నామని తెలియటానికి తలుపు మీద తువ్వాలు వేసుకోవాలి.

* నెలసరి ఖర్చుల కోసం బ్యాంకు ఖాతా నుంచి గానీ పిల్లల దగ్గర్నుంచి గానీ ఒకేసారి డబ్బు తీసుకోవాలి.

* అవకాశమున్నంతవరకు అందరితోనూ.. ముఖ్యంగా ఇంట్లో వాళ్లతో ప్రేమగా మాట్లాడాలి.

గుర్తుంచుకోవాల్సిన మాట

పెద్దవయసులోకి అడుగిడిన వారంతా రోజూ ఒక క్యాల్షియం మాత్ర, బి-కాంప్లెక్స్‌ మాత్ర, ఐరన్‌ మాత్ర వేసుకోవటం ఆరోగ్యపరంగా మంచిది. మూడు మాత్రలు ఎక్కువనుకుంటే అన్నీ కలిసి ఉన్న మాత్రలు వేసుకోవచ్చు. మరో ముఖ్యమైన సంగతి- ఏ విషయంలోనైనా సరిపెట్టుకోవటం (అడ్జస్ట్‌), అలవాటు పడటం (అడాప్ట్‌), సర్దుకుపోవటం (అకామడేట్‌), అంగీకరించటం (యాక్సెప్ట్‌) అనే దృక్పథాన్ని పాటించగలిగితే వృద్ధాప్యం హాయిగా గడిచిపోతుంది.

ఇదీ చదవండి:గోరింటాకుతో అరచేతుల్లో ఆరోగ్యం పండుతుంది!

ABOUT THE AUTHOR

...view details