కేరళ రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో సఫలమయ్యారు అక్కడి మంత్రి మంత్రి కె.కె.శైలజ. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రజాసేవా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడే ఘనత సాధించారు. ఇలా మన దేశం నుంచి ఈ అవకాశం అందుకున్న ఏకైక వ్యక్తి శైలజే! కొవిడ్ కల్లోలం నుంచి కేరళ బయటపడిందంటే అందుకు కారణం ఆమే అని ఎక్కువ మంది భావన. నిఫా వైరస్ కేరళను చుట్టుముట్టినప్పుడు కూడా శైలజే ఆరోగ్యశాఖా మంత్రి. దానినీ సమర్థంగా ఎదుర్కొన్నారు. ‘నిఫా యువరాణి, కొవిడ్ రారాణి’ అంటూ ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. అన్నింటికీ తన పనితీరుతో జవాబు చెప్పారు శైలజ.
అందరికన్నా మెరుగ్గా..
చిన్నప్పటి నుంచీ ముక్కుసూటి మనిషి ఆమె. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు. పని విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చే దాకా విశ్రమించే ప్రసక్తే లేదంటారు.తనే కాదు.. తన టీమ్ మొత్తాన్నీ ఉరుకులు, పరుగులు పెట్టించేస్తారు. ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ.. పక్కాగా అమలు చేస్తుంటారు. కరోనా కేసులు బయటపడగానే ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారామె. వైరస్ గురించి సమగ్ర సమాచారం తెలియకముందే.. పలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆరోగ్య యంత్రాంగాన్ని పూర్తిగా సన్నద్ధం చేశారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు కల్పించారు. అదనపు పడకలు సిద్ధం చేయించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ విధానాన్ని గట్టిగా అమలు చేశారు. 63 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా ఇరవై నాలుగు గంటలు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందికి అండగా నిలిచారు. ఆమెకు వైద్యశాస్త్రంపై అంతగా అవగాహన లేదు. అయితేనేం.. పరిస్థితులను అర్థం చేసుకునే దక్షత ఉంది. వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాల్లో స్పష్టత ఉంది. అవే ఈ విపత్కర పరిస్థితిలో కేరళకు కవచంగా మారాయి. అందుకే రాక్‌స్టార్ హెల్త్‌మినిస్టర్‌గా ప్రశంసలు పొందారామె. ఐక్యరాజ్యసమితి నుంచి పిలుపు అందుకుని తాము ఏవిధంగా కొవిడ్‌ని కట్టడి చేస్తోంది చెప్పుకొచ్చారామె.
ఇవీ చూడండి:గల్వాన్ ఘటన కేంద్రం వైఫల్యమే: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి