వ్యాధి నిరోధక శక్తి మనుషులకే కాదు.. ధరించే వస్త్రాలకూ ఎంతో అవసరం అంటోంది.. హైదరాబాద్‌కు చెందిన యువ వ్యాపారవేత్త.. దీప్తి నత్తల. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దీప్తి.. అడుగడుగునా ఎదురైన ఆటంకాలు అధిగమించింది. వైరస్‌ల్ని పసిగట్టి.. వ్యాధుల పనిపట్టే యాంటీ వైరల్ వస్త్రం తయారు చేసి.. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యకు తనవంతు పరిష్కారం చూపింది దీప్తి.
దీప్తి ప్రస్థానం
2007లో ఐఐటీ మద్రాస్ నుంచి నానో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దీప్తి.. బెంగళూరు, ముంబయితో పాటు దుబాయ్, అమెరికాల్లోనూ ఉద్యోగం చేసింది. 2019లో భారత్‌కు తిరిగొచ్చిన సమయంలో స్థానిక వాతావరణానికి ఇబ్బంది పడింది. బయటకు వెళ్తే తలనొప్పి, చర్మ సమస్యలు వచ్చేవి. ఎండ తట్టుకోలేకపోయేది. సన్ స్క్రీన్ లోషన్, దుపట్టాలు వాడినా అనారోగ్య సమస్యలు తప్పలేదు. అప్పుడే మహిళలు వాడే దుపట్టాలు, చేతి రుమాలు ఎంత వరకు సురక్షితమో తెలుసుకోడానికి నేషనల్ ల్యాబోరేటరికి నమూనాలు పంపించింది. కాలుష్యం, అతినీల లోహిత కిరణాల నుంచి 10%మాత్రమే రక్షణ కల్పిస్తాయని తెలుసుకుని.. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకుంది.
మొదట యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్
ముందుగా దీప్తి.. అతినీల లోహిత కిరణాలు, ధూళి కణాల వల్ల వచ్చే సమస్యలపై దృష్టి పెట్టింది. వాటి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు, వచ్చే వ్యాధుల గురించి పరిశోధన చేసింది. అప్పుడే వైరస్, బ్యాక్టీరియాల్ని అడ్డుకునే వస్త్రం తయారు చేయాలనే ఆలోచ వచ్చింది. స్నేహితుల సహకారంతో కోయంబత్తూర్‌లోని అన్నా విశ్వవిద్యాలయం పరిశోధకుల్ని కలిసింది. బయోడీగ్రేడబుల్ ఫ్యాబ్రిక్ తయారీపై విస్తృత అధ్యయనం చేసింది. 8 నెలల కృషి తర్వాత యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్ తయారు చేసింది.. దీప్తి.
ఎలాంటి దుస్తులైనా కుట్టించుకోవచ్చు
దీప్తి తన ఫ్యాబ్రిక్.. మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉండగానే కరోనా వ్యాప్తి మొదలైంది. లాక్డౌన్ సమయంలో మరింత అధ్యయనం చేసి.. కరోనా సహా అన్నిరకాల సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించేలా దానిని తీర్చిదిద్దింది. సాధారణ కాటన్ వస్త్రం తీసుకొని అందులోకి బ్యాక్టీరియా, వైరస్లు చంపే నానో మాలిక్యూల్స్ చొప్పించింది. సూక్ష్మజీవులు, యూవీ కిరణాలు, బ్యాక్టీరియాలను చంపే ఒక బాడీగార్డ్‌ను రక్షణగా అతికించి.. ఈ నయా ఫ్యాబ్రిక్‌ను మలిచింది దీప్తి. ఈ వస్త్రంతో ఎలాంటి దుస్తులైనా కుట్టించు కోవచ్చు. వాటిని ధరించినప్పుడు వస్త్రంలోని నానో మాలిక్యూల్స్... వైరస్లు, ఇతర వ్యాధి కారకాలను అడ్డుకుంటాయి.