ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుల(Police)కు సమానం. ఇది పోలీసులు నిరంతరం చెప్పే మాట. గత ఏడేళ్లుగా రాష్ట్రంలో పోలీసులు (Telangana Police) విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నివాస సముదాయాల్లోనూ నిఘానేత్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పోలీసులు చెబుతుంటారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే 7లక్షలకు పైగా సీసీ కెమెరాలున్నాయి. వీటిని 10లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సీసీ కెమెరాల ఏర్పాటు చేసి వదిలేయడం వల్ల చాలా చోట్ల అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన పలు సంఘటనలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
సగం కూడా...
మూణ్నెళ్ల క్రితం రాజ్‌భవన్ (Raj Bhavan) ముందు ముగ్గురు యువకులు హంగామా చేశారు. వారి జాడ కోసం సీసీ కెమెరా (CC Camera) పరిశీలించగా అది పనిచేయడం లేదని గుర్తించారు. ఆగమేఘాల మీద వెంటనే ప్రధాన సీసీ కెమెరాను మరమ్మతు చేయించారు. కేబీఆర్ పార్కులో ఈ నెల 14న చౌరాసియా అనే మహిళపై ఓ వ్యక్తి దాడి చేసి చరవాణి లాక్కెళ్లాడు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా 65 సీసీ కెమెరాల్లో కనీసం 10కూడా పనిచేయడం గుర్తించారు. ప్రముఖులు తిరిగే ప్రధాన స్థలాల్లోనే ఈ విధంగా ఉంటే... మిగతా చోట్ల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.