పార్లమెంటులో చట్టాలు చేసే ఎంపీలు వాళ్లంతా.. రాష్ట్ర ప్రయోజనాలు, స్థానికుల అవసరాలపై రైల్వేశాఖకు వినతులు పంపారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి రెండువందల వరకు వినతులు దక్షిణ మధ్య రైల్వేకు అందాయి. కొత్త రైళ్లు కావాలని.. ఉన్నవి పొడిగించాలని.. కొత్త లైన్లు కావాలని, స్టేషన్లలో ఎస్కలేటర్లు, అదనపు టికెట్ కౌంటర్లు పెట్టాలని, రోడ్ అండర్‌బ్రిడ్జిలు కావాలని అడిగారు. వీటికి దక్షిణ మధ్య రైల్వే ‘‘నడిపించలేం.. పొడిగించలేం.. కొత్త రైళ్లు వేయలేం..’’ అంటూ సమాధానమిచ్చింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల ఎంపీలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించిన రైల్వే వారి వినతులకు తాజాగా సమాధాలు పంపింది. వాటిని పరిశీలిస్తే కనీసం రైల్వే బోర్డుకు నివేదించకుండానే 90 శాతం వరకు వినతులను జోన్ స్థాయిలోనే తిరస్కరించినట్లు తెలుస్తోంది. నిజానికి కొత్త ప్రాజెక్టులు, రైళ్లు, అదనపు స్టాపేజీలపై నిర్ణయం రైల్వేబోర్డుది. ఎంపీల ప్రతిపాదనల్ని జోన్ స్థాయిలోనే తీసిపారేస్తే రైల్వేబోర్డుకు చేరేదెలా? అనేది ఇక్కడి ప్రధాన సందేహం.
ఆగితేనే కదా తెలుస్తుంది!
ఎంపీలు ప్రధానంగా ముఖ్యస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆపాలని కోరారు. వాటిలో ఆదాయం పెద్దగా రాదని రైల్వే బదులిచ్చింది. ప్రయోగాత్మకంగా ఆరునెలలు ఆపితే ప్రయాణికుల డిమాండ్ తెలుస్తుందనేది నిపుణుల పేర్కొన్నారు. హైదరాబాద్-అజ్మీర్ రైలు ఫ్రీక్వెన్సీ పెంచాలని, కర్నూలు-అజ్మీర్ మధ్య రైలు కావాలని అడిగితే ఇతర జోన్లు అంగీకరించట్లేదని పేర్కొంది. అలాగే దేవరకద్రలో 8 రైళ్లు ఆపాలని కోరితే సికింద్రాబాద్-కర్నూలు రైలు ఆపడానికే సానుకూలంగా స్పందించింది.