వేరే వాళ్లతో పరీక్ష రాయించి నకిలీ అర్హతతో కొందరు వైద్యులుగా మారిపోతున్నారు. పరీక్షా సెంటర్ల నిర్వాహకులు, కొందరు వైద్యులు ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాపై రాచకొండ పోలీసులు కొరడా ఝుళిపించారు.
పరీక్ష కఠినమని అడ్డదారుల్లో...
మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లకు గట్టిపోటీ ఉంటోంది. మంచి ర్యాంకు వస్తే కానీ సీటు దొరకడం కష్టం. కొంత మంది విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చదువుతున్నారు. తర్వాత వాళ్లు భారత్‌లో వైద్య వృత్తి కొనసాగించాలంటే ఇక్కడ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) నిర్వహించే ఆన్లైన్ అర్హత పరీక్ష ఎఫ్ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్) పాసవ్వాలి. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. భారీగా వెచ్చించి ప్రత్యేక శిక్షణ తీసుకున్నా.. గట్టెక్కలేక చాలా మంది పక్కదారి పడుతున్నారు.
పంపకాల్లో తేడా రావడంతో బయటకు
కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సతీశ్ కుమార్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదివాడు. 2016 జులైలో భారత్‌కు వచ్చాడు. రెండు, మూడు సార్లు ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరైనా పాసవ్వలేదు. మియాపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పని చేస్తున్న కోట గంగాధర్ రెడ్డి ముఠాను ఆశ్రయించాడు. రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చాడు. అతనికి బదులుగా కర్మన్‌ఘాట్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఝార్ఘండ్కు చెందిన సంతోష్ సింగ్(40) అనే వైద్యుణ్ని నగరానికి రప్పించారు. సెంటర్ నిర్వాహకుల మధ్య పంపకాల్లో తేడా రావడం వల్ల ఈ విషయం బయటకు పొక్కి, రాచకొండ పోలీసులకు చేరింది.