ప్రపంచాన్ని గడగలాడిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి అనిర్వచనీయం. బాధితులకు చికిత్స అందిస్తూ... వైరస్ సోకి ఇప్పటికే పలుచోట్ల వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రక్షణకు హైదరాబాద్ బాచుపల్లికి చెందిన భానుచందర్ పలు ఆవిష్కరణలు చేశాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో క్వారంటైన్‌లో ఉన్న వారి పర్యవేక్షణకు మనుషుల ప్రమేయం తగ్గించేలా పలు డిజైన్లు తయారు చేశాడు. ఐసీయూలోని రోగులకు ఆహారం, మందులు అందించేందుకు తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబో ఎంతో ఆకట్టుకుంటోంది. వైద్యసిబ్బంది ప్రతిసారి రోగుల వద్దకు వెళ్లాల్సిన అవసరంలేకుండా రోబో ద్వారా అందించేలా ఏర్పాటు చేశాడు.
సెన్సార్లతో పనిచేసే హ్యాండ్‌వాష్ డిస్పెన్సర్
కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం చేతులు కడుక్కోవటం, సానిటైజ్ చేసుకోవటం తప్పనిసరైంది. ఇందుకు సెన్సార్లతో పనిచేసే హ్యాండ్‌వాష్ డిస్పెన్సర్, మెకానికల్ సానిటైజర్ డిస్పెన్సర్‌తయారు చేశాడు. వాటిద్వారా ఆస్పత్రలు, కార్యాలయాల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది లిక్విడ్ సోప్, సానిటైజర్‌ను చేతితో నొక్కకుండానే శుభ్రం చేసుకోవచ్దు. వీడియోరోవర్‌తో క్వారంటైన్‌లో ఉన్నవారిని నిత్యం పర్యవేక్షించవచ్చు. వారితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ... సలహాలు ఇవ్వొచ్చు. ఇవన్నీ వైఫై, బ్లూటూత్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. వీటికి ఆదేశాలిచ్చే అప్లికేషన్‌నూ భాను సొంతంగా తయారు చేశాడు. వాటన్నింటిని అతితక్కువ ఖర్చుతో.. మొబైల్ ద్వారా ఆపరేట్ చేసే వీలుంటుంది.