తెలంగాణ

telangana

ETV Bharat / state

అట్లూరి రామమోహనరావు కన్నుమూత.. నివాళులర్పించిన ప్రముఖులు - రామమోహనరావుకు నివాళులు అర్పించిన చంద్రబాబు

Atluri Rammohan rao: రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు కన్నుమూశారు. ఈనాడు పత్రిక ఉన్నతిలో, విస్తృతిలో ఆయనది ప్రత్యేక స్థానం. ఐఐఎంల వంటి అత్యుత్తమ సంస్థల్లో చదువుకోపోయినా... అతిసామాన్యులతో అసాధారణ పనులు చేయించిన నేర్పరి రామమోహనరావు. యాజమాన్య ప్రతినిధిగా ఉద్యోగుల శ్రేయోభిలాషిగా ఇరువుర్నీ మెప్పించిన సవ్యసాచి ఆయన. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బందిని ప్రోత్సహిస్తూ... నిరంతరం ప్రేరణ కల్పిస్తూ నిరాడంబర కర్మయోగిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన స్ఫూర్తి ప్రదాత రామమోహనరావు .

Atluri Rammohan Rao
Atluri Rammohan Rao

By

Published : Oct 22, 2022, 7:50 PM IST

Updated : Oct 22, 2022, 7:58 PM IST

Atluri Rammohan rao: రామోజీ గ్రూపు సంస్థల్లో దశాబ్దాలపాటు ఎండీగా సేవలందించిన... అట్లూరి రామ్మోహనరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం... ఒంటి గంట 49 నిమిషాలకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రామమోహనరావు పార్థివదేహాన్ని బంధు, మిత్రుల సందర్శనార్థం జూబ్లీహిల్స్ లోని నివాసానికి తరలించారు. రామమోహనరావు భౌతికకాయానికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నివాళులు అర్పించారు.

రామమోహనరావు భౌతికకాయాన్ని సందర్శించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. నివాళులు అర్పించారు. రామోజీరావు కుటుంబసభ్యులు, గ్రూపు సంస్థల సీనియర్ ఉద్యోగులు రామమోహనరావు భౌతికకాయానికి శ్రద్ధంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో... రామమోహనరావు జన్మించారు. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలి... 1974లో ఈనాడులో ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1982లో... ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది 1995 వరకూ కొనసాగారు. 1992 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణ వ్యవహారాల్లోనూ... పాలుపంచుకున్నారు. 1995లో ఫిల్మ్ సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలం ఆ బాధ్యతల్లో కొనసాగారు.

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు... రామమోహనరావు బాల్య స్నేహితుడు, సహాధ్యాయి. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిన్నతనం నుంచే కలిసి పెరిగారు. ఇంటర్‌, డిగ్రీ కూడా... కలిసి చదువుకున్నారు. డిగ్రీ తర్వాత రామమోహనరావు కార్మిక శాఖలో క్లర్క్‌ ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత... బీఎడ్‌లో సీటు రావడంతో క్లర్క్‌ కొలువుకు రాజీనామా చేసి గుంటూరు ఏసీ కళాశాలలో చేరారు. అక్కడ కోర్సు పూర్తయ్యాక కర్నూలులో ఉపాధ్యాయ జీవితం ప్రారంభించారు. పిల్లలు, పాఠాలు పరీక్షల మధ్య చాలాకాలం ఉపాధ్యాయవృత్తే ప్రపంచంగా గడిపారు.

ప్రాణ స్నేహితుడు రామోజీరావు పిలుపుతో... ఉద్యోగానికి రాజీనామా చేసి ఈనాడు అక్షరయాత్రలో చేరారు. ఆలోచన రామోజీరావుదైతే దాన్నిపక్కాగా అమలుచేయడంలో రామమోహనరావు కీలకపాత్ర వహించారు. ప్రతీపనినీ... అంకితభావంతో పూర్తి చేసేవారు. రామోజీ గ్రూపు సంస్థల ప్రతీ అంచెలోనూ తనదైన పాత్రపోషించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్‌సిటీ నిర్వహణలోనూ.. కీలకంగా వ్యవహరించారు. 87 ఏళ్ల వయసులో... రామమోహనరావు కన్నుమూశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రామమోహనరావు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 22, 2022, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details