Airlines Passengers Rights : రోజురోజుకు పెరుగుతున్న విమానయానంతో పాటు ప్రయాణ సేవల్లో లోపాలపై ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. ప్రయాణం రద్దు, ఆలస్యం, ఓవర్ బుకింగ్‌తో బోర్డింగ్ నిరాకరించడం, బ్యాగులు మాయం, సామగ్రి ధ్వంసం, రీఫండ్ ఇవ్వకపోవడం, తదితర అంశాలపై హైదరాబాద్ పరిధిలోని నాలుగు వినియోగదారుల కమిషన్లలో కేసులు నమోదవుతున్నాయి. ఇలా నెలకు సుమారు 10 కేసుల వరకు తీర్పులు వస్తున్నాయి. బాధితులకు తగిన పరిహారం చెల్లిస్తున్నారు.
ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రయాణికుల సామాన్లు పోతే ఎయిర్‌లైన్స్ సిబ్బంది నుంచి సుమారు రూ.25వేల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సుమారు 1.50లక్షలు వరకు పరిహారం అందుకోవచ్చు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 500 వరకు విమానాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తాయి. అమెరికాతో పాటు దుబాయ్, కువైట్, ఖతార్, గల్ఫ్ దేశాలకు మన రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ సేవలపై, సంస్థల నిర్లక్ష్యం, ప్యాసెంజర్ హక్కులపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్యాసింజర్ ఛార్టర్లో ఏముంది : వివిధ కారణాలతో విమానాలు ఆలస్యం అవుతుంటాయి. ఆ సమయంలో ప్రయాణం 2 గంటలు ఆలస్యమైతే సదరు విమాన సర్వీస్ ప్రయాణికులకు ఉచిత భోజనం అందిచాలి. ఆరు గంటల వరకు ఆలస్యమైతే మరో విమానం ఏర్పాటు చేయాలి. లేదంటే టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలి. ఈ ఆలస్యంతో కనెక్టింగ్ విమానం కూడా అందుకోలేకపోతే రూ.10 వేల వరకు ప్రయాణికుడికి పరిహారం ఇవ్వాలి.