Seethakka on Medaram Jatara in Warangal : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగబోయే మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలపై చర్చించారు. మేడారం జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈసారి జాతర సమయంలోనే జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని తెలిపారు.
మాజీ నక్సలైట్ నుంచి రాష్ట్ర మంత్రిగా - సీతక్క రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు
కేంద్ర ప్రభుత్వానికి మేడారం జాతరగురించి మరోసారి ప్రతిపాదనలు పంపి జాతీయ పండుగ హోదా కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. అప్పుడు రాష్ట్ర బడ్జెట్‌కు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించవచ్చని తెలిపారు. వచ్చేవారం ఏటూరు నాగారంలోని ఐటీడీఏ అధికారులందరితో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేస్తామన్నారు. ఈ సమీక్షలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, అదనపు సంచాలకులు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లి వంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.
Minister Seethakka Meet With Panchayati Raj Department :అంతకుముందు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్‌డీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనితీరుపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రత్యేక కమిషనర్ ప్రదీప్‌కుమార్ శెట్టి, డైరెక్టర్ హనుమంతరావు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంజీవరావు, స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తదితరులు ఆయా విభాగాల వారీగా అమలవుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతిఒక్కరికి చేరువయ్యేంత సమర్థవంతంగా పనిచేయాలని సీతక్క సూచించారు.