Kanti Velugu Second Phase in Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా నేత్ర పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కంటివెలుగు కేంద్రాల్ని ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. మంత్రి తలసానితో కలిసి హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని వివేకానంద కమ్యూనిటీహాల్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.
వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామనటం.. తెలంగాణకు గర్వకారణం:పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడిన మంత్రులు.. పలువురికి అద్దాలు పంపిణీ చేశారు. అంధత్వరహిత తెలంగాణే కంటి వెలుగు లక్ష్యమన్న హరీశ్‌రావు... రాష్ట్ర పర్యటనకు వచ్చిన ముఖ్యంత్రులు.. కంటి వెలుగు కార్యక్రమాన్ని వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామనటం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ దోమల్‌గూడలోని ఏవీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన నేత్ర వైద్యశిబిరాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పర్యవేక్షించారు.
జూబ్లీహిల్స్ మధురానగర్‌లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీతో కలిసి.. నేత్రవైద్య శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో కంటి వెలుగు శిబిరాలకు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నేత్రవైద్యశిబిరాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఎవరూ నేత్ర సమస్యలతో బాధపడొద్దు: నిజామాబాద్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తానూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. రాష్ట్రంలో ఎవరూ నేత్ర సమస్యలతో బాధపడొద్దనే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. మిర్యాలగూడలోని రైతు వేదిక భవనం వద్ద నేత్ర వైద్యశిబిరం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధిని కొందరు చూడలేకపోతున్నారు: రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేకపోతున్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కంటి పరీక్షలు చేసి.. అద్దాలు ఇవ్వాల్సిన అవసరముందని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఎద్దేవా చేశారు. మహబూబాబాద్‌లోని గుమ్మనూరు ప్రభుత్వ పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్న మంత్రి.. కళ్లుండి చూడలేని కొందరికి.. కేసీఆర్ ప్రగతి కార్యక్రమాలు కనిపించటం లేదని సత్యవతి రాఠోడ్ ఆరోపించారు.