తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona Vaccination: రెండో డోస్​ విషయంలో అలుముకుంటున్న నిర్లక్ష్యపు నీడలు - telangana varthalu

కరోనా మహమ్మారి కోరలు కత్తిరించే మార్గంగా వ్యాక్సిన్​ను ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. గత పది నెలలుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. మరోవైపు వచ్చే ఒకట్రెండు నెలల్లో ప్రతి ఒక్కరికి టీకా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండో డోస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యపు నీడలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు పాతిక లక్షల మందికిపైగా మంది గడువు ముగిసినా రెండో డోస్ తీసుకోలేదు. ఇందుకు కారణం ఏమిటి? లోపం ఎక్కడ ఉంది అన్నదే ప్రశ్నార్థకంగా మారుతోంది.

Corona Vaccination: రెండో డోస్​ విషయంలో అలుముకుంటున్న నిర్లక్ష్యపు నీడలు
Corona Vaccination: రెండో డోస్​ విషయంలో అలుముకుంటున్న నిర్లక్ష్యపు నీడలు

By

Published : Oct 17, 2021, 4:22 PM IST

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75 శాతానికి పైగా కొవిడ్ టీకాలు అందించారు. డిసెంబర్ చివరి నాటికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న ప్రణాళికలతో సర్కారు ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,82,95,559 టీకా డోసులు పంపిణీ చేయగా అందులో 2,03,83,976 మందికి మొదటి డోస్ ఇవ్వగా.. అందులో 79,11,583 మందికి మాత్రమే రెండు డోసులు పూర్తైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హెల్త్ కేర్ వర్కర్లు 3,06,885, ఫ్రంట్ లైన్ వర్కర్లు 3,18,067, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారు 1,16,00,469. 45 ఏళ్లు పైబడిన వారు 81,58,555 మంది టీకాలు తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు మరో 18 లక్షల మందికి మాత్రమే తొలిడోసు టీకా ఇవ్వాల్సి ఉంది.

రెండో డోస్​ విషయంలో నిర్లక్ష్యం

మూడో వేవ్​ను నిలువరించేందుకు ప్రతి ఒక్కరికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తున్న సర్కారు.. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. డోసుల విషయంలోనూ ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చించి కావాల్సిన సంఖ్యలో టీకాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అధికారిక లెక్కల ప్రకారం 18 లక్షల మందికంటే తక్కువగానే తొలిడోస్ తీసుకోవాల్సిన వారు ఉన్నప్పటికీ రెండో డోస్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. 1,24,72,393 మంది తొలిడోస్ పూర్తై రెండో డోస్ తీసుకోవాల్సి ఉండగా.. అందులో ఇప్పటికే సుమారు 25 లక్షల మందికి పైగా గడువు ముగిసినా రెండో డోస్ తీసుకోలేదు. ప్రభుత్వం గతంలో తొలి డోస్​కి అధిక ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు ప్రజలు రెండో డోస్ విషయంలో కాస్త నిరాసక్తత చూపటం సహా అనేక కారణాలతో రెండో డోస్ ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. అనేక ప్రాంతాల్లో టీకా అందుబాటులో ఉన్నా.. రెండో డోస్ కోసం ప్రజలు ముందుకు రాని పరిస్థితి. గత రెండు నెలలుగా పెళ్లిళ్లు పండుగల సీజన్ కావటంతో టీకా తీసుకుంటే జ్వరం, ఒళ్లు నొప్పుల వంటివి వచ్చే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు టీకాకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికైనా..

గత గురువారం నుంచి రాష్ట్రంలో టీకా కార్యక్రమం నిలిచిపోయింది. మళ్లీ సోమవారమే వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండో డోస్ తీసుకోవాల్సిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక రెండో డోస్ విషయంలో మరింత ప్రణాళికా బద్ధంగా ఉండాలని ఏకంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలు సైతం ఇప్పటికైనా రెండో డోస్ విషయంలో అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి.

రెండో డోస్​పై గవర్నర్​ ట్వీట్​

ఇదీ చదవండి: 'టీకా వేయాలని ప్రయత్నిస్తే.. పాముతో కరిపిస్తా'

ABOUT THE AUTHOR

...view details