యూనివర్సిటీలు, బోర్డుల నుంచి ఫలితాలను తీసుకుని తదుపరి ప్రక్రియ జరిగేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ ఆలోచన విజయవంతమైతే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఏటా 13 లక్షల మంది విద్యార్థులు బోధన ఫీజులు, ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో కొత్తగా కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య 5.5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటోంది.
సకాలంలో రాక..
మిగతా విద్యార్థులు కోర్సులో భాగంగా పైతరగతులు చదువుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ప్రతి సంవత్సరం దరఖాస్తును రెన్యువల్ చేసుకోవాలి. ఇవి సకాలంలో రాకపోవడంతో పాటు దరఖాస్తు ప్రక్రియకు విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఇదే అదనుగా కొందరు బ్రోకర్లు దరఖాస్తు, రూ.10 జ్యుడిషియల్ కాగితంపై ఆదాయ ధ్రువీకరణ పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తు కోసం ఒక్కో విద్యార్థి రూ.300 వరకు వెచ్చిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రవేశపరీక్షల (సెట్స్), దోస్త్ ద్వారా కోర్సుల్లో చేరిన విద్యార్థుల వివరాలు ఈ-పాస్‌లో అప్‌డేట్ చేస్తున్నారు.