తెరాస అధికారంలోకి వచ్చాక రైతులకు గిట్టుబాటు ధరలేదని, ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు అందరికీ రైతు బంధు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గతేడాది రైతుబంధు 60శాతం మందికి కూడా రాలేదని... ఈ ఏడాది వస్తుందా రాదా అనేది ఎవ్వరికి తెలియదని విమర్శించారు. ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతులతో సమావేశం పెట్టిన దాఖలాలు లేవన్నారు. విత్తమంత్రి ఎప్పుడు సంగారెడ్డికి వచ్చినా రైతుబంధు కోసం నిలదిస్తానని తెలిపారు.
'తాను చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామంటున్న ముఖ్యమంత్రి రైతుబంధు తప్పించుకునే ప్రయత్నంలో ఇదొక భాగం. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిన పంట రైతులు వెయ్యరు. అసలు ఏ ఊర్లో ఏ పంట వేస్తారో అన్నది ముఖ్యమంత్రికి తెలిసే అవకాశం ఉందా..? అసలు వ్యవసాయ శాఖ సంబంధించిన ఉద్యోగులే పూర్తిస్థాయిలో లేరు. నేను చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు అన్నారు. రేపు కల్యాణలక్ష్మి విషయంలో తాను చెప్పిన వాడిని చేసుకుంటేనే కల్యాణలక్ష్మి ఇస్తానంటారేమో!. రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. రాష్ట్రం పెద్ద ప్రమాదంలో ఉంది. ఏదీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నా ప్రయత్నం, నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.'