తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బంద్ ప్రశాంతం.. పాక్షికంగా తిరిగిన బస్సులు...

తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఐకాస తలపెట్టిన బంద్​ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మాత్రమే జరిగాయి. ఆర్టీసీ క్రాస్​ రోడ్డు వద్ద సీపీఐఎంఎల్‌ నేత పోటు రంగారావును అరెస్ట్ చేస్తున్న క్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆయన బొటనవేలుకి గాయమైంది.  బంద్​కు విపక్షాలు, ఉగ్యోగ సంఘాలు, ఓలా, ఊబర్​ క్యాబ్స్​, ఆటో డ్రైవర్లు మద్దతు పలికారు.  బస్సులు పాక్షికంగా తిరగగా.. మెట్రో పూర్తిస్థాయిలో సేవలందించింది.

హైదరాబాద్​లో బంద్

By

Published : Oct 19, 2019, 8:36 PM IST

Updated : Oct 19, 2019, 11:16 PM IST

హైదరాబాద్​లో బంద్ ప్రశాంతం

ధర్నాల, నిరససలు, ఆందోళనలు, అరెస్టుల మధ్య హైదరాబాద్​లో ఆర్టీసీ బంద్​ ముగిసింది. నగరంలోని అన్ని డిపోల వద్ద అఖిల పక్ష, ఆర్టీసీ ఐకాస నేతలు ఉదయం నుంచే ధర్నాకు దిగారు. కాంగ్రెస్, సీపీఐ నేతలు ఎంజీబీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉదయం రాష్ట్రబస్సులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ సర్వీసులు బస్సులు పాక్షికంగా తిరిగాయి. తెలంగాణ రాష్ట్ర బంద్​కు మద్దుతుగా కాంగ్రెస్​ నాయకులు చార్మినార్‌లో సద్భావనయాత్ర నిర్వహించారు. దారివెంట ఉన్న దుకాణ సముదాయలను మూసివేయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు, మాజీ ఎంపీ అంజన్​ కుమార్​ యాదవ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

జూబ్లీ బస్టాండ్​లో ఉద్రిక్తత

ఉదయం నుంచి జూబ్లీ బస్టాండ్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మార్పీఎస్, ఆర్టీసీ, భాజపా నాయకులు బంద్​కు మద్దతుగా జేబీఎస్​కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

వామపక్ష నేతకు గాయం

వామపక్షాలు గోల్కొండ కూడలి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టాయి. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, విమలక్క, పీఓడబ్ల్యూ సంధ్యతో పాటు వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడం వల్ల రోడ్డుపైనే బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేతలను అరెస్ట్ చేశారు. సీపీఐఎంఎల్‌ నేత పోటు రంగారావును అరెస్ట్ చేస్తున్న క్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. రంగారావును వ్యాన్‌లో ఎక్కించే క్రమంలో బొటనవేలుకు తీవ్ర గాయమైంది. ఆయన్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అరెస్టులు

బంద్‌లో భాగంగా అబిడ్స్‌ జీపీఓ వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, మోహాన్‌ రెడ్డిలను అరెస్ట్ చేసి అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డితో పాటు మాజీ ఎంపీ అజీజ్‌ పాషాను పార్టీ రాష్ర్ట కార్యాలయంలో పోలీసులు అరెస్ట్ చేసి బేగం బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ ఐకాస బంద్​తో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉదయమే హైదరాబాద్ చేరుకరున్న వారు.. స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్

Last Updated : Oct 19, 2019, 11:16 PM IST

ABOUT THE AUTHOR

...view details