RS Praveen kumar fires on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికై సిద్ధమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో రాజ్యాంగ రూపొందించారని... అలాంటి రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని ఆయన నిలదీశారు. కేసీఆర్ తన ఆస్తులు, కమీషన్లు పెంచుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చలా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే ఏర్పడిన రాష్ట్రానికి... ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచిపోయారన్నారు.
'పతనం తప్పదు'
సీఎం కేసీఆర్ దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని వారికి సంబంధించిన వాళ్లకి కట్టబెట్టడానికా?... నిరంకుశ పాలన కొనసాగించడానికా? రాజ్యాంగాన్ని మార్చడం అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలని అనుకునే ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యంగాన్ని పూర్తిగా మార్చాలని సీఎం కేసీఆర్ అన్నారు. 75 సంవత్సరాలు అయింది.. పూర్తిగా మార్చాలన్నారు. ఎందుకు మార్చాలి. మీ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించడానికి మార్చేయమంటున్నారా? లేకపోతే ప్రాజెక్టులు, కమీషన్లు, కాంట్రాక్టులు, ఆస్తుల సంపద మొత్తం మీ కుటుంబాలకు వచ్చేందుకు మార్చమంటున్నారా? నిరుద్యోగుల పొట్టకొట్టడానికి మార్చాలా? ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్యాంగం మార్చే ప్రక్రియను సంహించం. ప్రాణత్యాగం చేసి అడ్డుకుంటాం. పేద ప్రజల ఓటును అక్రమంగా సంపాదించిన డబ్బును చల్లి.. అధికారంలో ఉన్నారు. కేసీఆర్ మాటలకుగాను నిరసన వ్యక్తం చేస్తున్నాం.