మూసీ నది కాదది ప్రాణాలను తీసే మృత నది నిజాం కాలంలో ప్రజల దాహార్తిని తీర్చిన మూసీ నది నేడు విషతుల్యమవుతోంది. నదిలోని కాలుష్యం కారణంగా జలచరాలు మరణిస్తున్నాయి. నదీ ప్రవహించే ప్రాంతాలైన బాపుఘాట్, నాగోల్, ప్రతాప సింగారం, మూసారాంబాగ్, పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో మూసీ నీటి నాణ్యతను రాష్ట్ర పీసీబీ పరీక్షించినపుడు పలు ఆందోళన కలిగించే విషయాలు వెలుగు చూశాయి.
నది పరివాహక ప్రాంతాల్లోని ఏ ఒక్క చోటా కనీసం జలచరాలు బతికే పరిస్థితి లేదు. మూసీ నీటిలో ఆక్సిజన్ పరిమాణం(డీవో) ‘సున్నా’గా నమోదయిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా గుర్తించింది. ఈ నదీ జలాలు గతం కంటే మరింత ఎక్కువ కలుషితమైనట్లు తేల్చింది.
జల కాలుష్యాన్ని ఎలా గుర్తిస్తారంటే..
- నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం(డీవో), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) తీవ్రత ఆధారంగా ఓ చెరువు లేదా కుంట కాలుష్యమైందా లేదా అని అంచనా వేస్తారు.
- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటరు నీటిలో డీవో పరిమాణం కనీసం 4 ఎంజీలు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ నీటిలో జలచరాలు బతకలేవు.
- బీవోడీ విషయానికొస్తే లీటరు నీటిలో 3 ఎంజీలను మించకూడదు. డీవో తగ్గుతున్న కొద్దీ బీవోడీ పెరుగుతుంది. అలా జరుగుతుందంటే ఆ నీటి వనరులో కాలుష్యం పెరుగుతుంది.
- బీవోడీని పరీక్షిస్తే పది నుంచి 15 రేట్లు ఎక్కువగా ఉంది. ముసారాంబాగ్ వంతెన వద్ద 51 ఎంజీలు, నాగోలులో 42 ఎంజీలు, బాపుఘాట్ దగ్గర 36 ఎంజీలు, పీర్జాదిగూడలో 34 ఎంజీలు, ప్రతాపసింగారంలో 30 ఎంజీలుగా ఉంది.
చేతులెత్తేసిన మూసీనది అభివృద్ధి సంస్థ
మూసీ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిగుట్టల్లో పుట్టి నగరం మీదుగా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. మొత్తం 250 కి.మీ.లు ప్రవహించి... నగరంలోకి చేరిన తర్వాత కాలుష్య తీవ్రత పెరుగుతోంది. దేశంలోనే అత్యంత కాలుష్య నదుల్లో మూసీ ఒకటి. ప్రక్షాళన, సుందరీకరణకు నిధుల్లేవని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డీసీఎల్) చేతులెత్తేసింది. ప్రతి రోజు శుద్ధి చేయకుండానే 800 ఎంఎల్‌డీ మురుగు నీరు నదిలో కలుస్తోందని, ఇక రాత్రికి రాత్రే నది గర్భంలో చేరే ప్లాస్టిక్, జీవవ్యర్థాలకు లెక్కలేదని సంస్థ తెలిపింది.
ఇదీ చూడండి: మేడిగడ్డలో 65, అన్నారంలో 4 గేట్లు ఎత్తివేత