తెలంగాణ

telangana

ETV Bharat / state

జలసిరులతో కళకళలాడుతున్న ప్రాజెక్టులు - Rising water levels in projects

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో... రాష్ట్రంలోని నదులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎస్సారెస్పీలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

జలసిరులతో కళకళలాడుతున్న ప్రాజెక్టులు

By

Published : Aug 10, 2019, 6:55 AM IST

Updated : Aug 10, 2019, 9:54 AM IST

జలసిరులతో కళకళలాడుతున్న ప్రాజెక్టులు

రాష్ట్రంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు.. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. జూరాలకు వరద పోటెత్తుతోంది. జూరాల పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జిల్లా కలెక్టర్‌ శశాంక హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 4 లక్షల 75 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. శ్రీశైలానికి 4లక్షల 98 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం నుంచి సాగర్​కు కృష్ణమ్మ పరుగులు...

శ్రీశైలం జలాశయంలో భారీగా వరద నీరు చేరడం వల్ల 5 గేట్ల ద్వారా లక్షా 31 వేల 195 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 3 లక్షల 16 వేల 986 క్యూసెక్కులు వస్తుండగా... ఔట్ ఫ్లో 2 లక్షల 36 వేల క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉండగా... ప్రస్తుతం 193.4 టీఎంసీలకు పైగానే నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,761 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్​కు భారీచేరిక

నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 2 లక్షల 5 వేల 181 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 9వేల 182 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 517.06 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం నీటినిల్వ 144.93 టీఎంసీలుగా ఉంది.

వర్షాలకు తోడైన వరద..

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 29 వేల 440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1060.40 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 90 టీఎంసీలకు గానూ.. 14.01 మాత్రమే ఉంది. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ చెరువులు అలుగు పోస్తున్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండా చెక్ డ్యామ్ లోకి భారీగా వరద నీరు చేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు జలకళను సంతరించుకోంది.

తెలుగురాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు మోస్తారు వర్షాలు

Last Updated : Aug 10, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details