తెలంగాణ రైతు ప్రపంచ ఖ్యాతి పొందాలన్నదే ధ్యేయమని, దీనికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు మంచి మార్కెటింగ్ జరగాలన్నారు. క్రయవిక్రయాలతో పాటు ఎగుమతుల్లోనూ పురోగమించాలన్నారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని.. దీనికి అనుగుణంగా రైస్‌మిల్లర్లు సన్నద్ధం కావాలన్నారు. మిల్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఆధునిక విధానాలను పాటించాలన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం రూపకల్పనలో భాగంగా సీఎం శనివారం ప్రగతిభవన్‌లో రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ అనిల్‌కుమార్, రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
మన రైతు ప్రపంచ ఖ్యాతి పొందాలి
రైతు ప్రపంచ ఖ్యాతి పొందాలన్నదే ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని.. పండించిన ప్రతి గింజకు మంచి మార్కెటింగ్ జరగాలన్నారు. దీనికి అనుగుణంగా రైస్‌మిల్లర్లు సన్నద్ధం కావాలని సూచించారు.
‘‘గొప్ప సంకల్పంతో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేస్తున్నాం. తెలంగాణ రైతు అన్ని విధాల లాభం పొందాలి. ఏ పంట వేస్తే సంపూర్ణ భరోసా వస్తుందో దాన్నే వేయాలి. రాష్ట్రం, దేశంతో పాటు అంతర్జాతీయ అవసరాలను తెలుసుకొని వరి పండించాలి. బీపీటీ, బాస్మతి.. ఇలా బియ్యంలోనూ వేర్వేరు రకాలపై వేర్వేరు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. ఏపీ, తమిళనాడు, కేరళ, దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో వాడే బియ్యానికి అనుగుణంగా వరి రకాల సాగు, మార్కెటింగ్ ఉండాలి. పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ విధానాలను బట్టి పురోగమించాలి. తెలంగాణ రైతు దానికి అనుగుణంగా బ్రాండ్ ఇమేజీ పొందాలి. సమగ్ర వ్యవసాయ విధానంలో రైస్‌మిల్లర్లది కీలకపాత్ర. ప్రస్తుతం తెలంగాణలోని రైస్‌మిల్లులు 70 లక్షల టన్నుల మిల్లింగ్ సామర్థ్యంతో ఉన్నాయి. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం ఉత్పత్తి అవుతున్నందున.. దీనికి అనుగుణంగా రైస్ మిల్లులు తమ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. భవిష్యత్తులో ధాన్యం డిమాండు పెరిగితే ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మిల్లర్లపైనే అందరి దృష్టి ఉంటుంది. అలాంటి పరిస్థితులకు ముందస్తుగా ఇప్పటినుంచే మిల్లర్లు సన్నద్ధం కావాలి. ధాన్యం రకాలు, క్రయవిక్రయాలు, మార్కెటింగ్ విధానాలపై రైతులను చైతన్యం చేయాలి’’ - కేసీఆర్, ముఖ్యమంత్రి