బాయిల్డ్ రైస్, రా రైస్ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించకుండా.. రైతులు, మిల్లర్లను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని రైస్ మిల్లర్ల సంఘం(Rice Millers Association) ఆవేదన వ్యక్తంచేసింది. హైదరాబాద్‌లో బేగంపేట టూరిజం ప్లాజా హోటల్‌లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘాల సమాఖ్య... ఈ సమస్యపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరింది. ధాన్యం ప్రతి గింజను కొంటామంటూనే తగిన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తోందని సమాఖ్య అధ్యక్షుడు తూడి దేవేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో గోనె సంచులు, హమాలీల కొరత, రవాణ, గోదాముల సమస్యలు వేధిస్తున్నాయన్న ఆయన... బియ్యం సేకరణ వేగవంతం చేయకపోవడంతో రైస్ మిల్లర్స్(Rice Millers Association) ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ధాన్యం కొనుగోలు విషయంలో తాత్సారం చేయవద్దన్నారు. ఇతర రాష్ట్రాల్లో వినియోగం లేదని కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదన్న దేవేందర్(Rice Millers Association).. ఎప్పటికప్పుడు విదేశాలకు ఎగుమతులు చేసుకోవచ్చని సూచించారు. అంతర్జాతీయ ఎగుమతులను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే తామే విదేశాలకు ఎగుమతి చేసుకుంటామని తెలిపారు. రైతులు నేరుగా మిల్లర్ల వద్దకు ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయించే వ్యవస్థ కావాలని తూడి దేవేందర్ రెడ్డి కోరారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు కూడా కొనసాగాలన్నారు. రైతుల సంక్షేమం, వినియోగదారులకు లాభం చేకూరే కోణంలో కేంద్రం ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.