Revanthreddy criticizes Dharani Portal : ఓటరు జాబితా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. గాంధీ భవన్లో మాట్లాడిన రేవంత్.. ధరణి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లని.. అందులో విదేశీయుల భాగస్వామ్యం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోర్టల్‌లో ఉన్న వివరాలన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు.
Revanthreddy fires on CM KCR : ధరణి పోర్టల్ అనేక చేతులు మారి.. బ్రిటీష్ ఐల్యాండ్ చేతికి వెళ్లిందని రేవంత్‌రెడ్డి అన్నారు.త్వరలో ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. కోదండ రెడ్డి, సంపత్‌తో కలిసి భూమి డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. నిషేధిత జాబితాలోని భూములను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అనుచరులకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే ప్రొహిబిషన్‌ను లాక్ చేస్తున్నారన్నారు. ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉందని వెల్లడించారు. జులై 15 తర్వాత ధరణిలో జరిగిన అక్రమాలను బయటపెడతానని రేవంత్ రెడ్డి తెలిపారు.