Revanth Reddy Visit Telangana CM Official Residence in Delhi :దిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సందర్శించారు. అంతకు ముందు ఉన్న కేసీఆర్ ఆ బంగ్లాను ఖాళీ చేయడంతో నేడు రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లారు. సీఎంగా ప్రమాణం తర్వాత తొలిసారి తుగ్లక్ రోడ్‌లోని బంగ్లాకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని దిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy Review Telangana Bhavan :భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, ప్రస్తుతం ఉన్న భవనాలు, స్థలం వంటి వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని, అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడీ హౌస్ ఉన్నట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. రాష్ట్ర వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నకు, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తి ప్రకారం ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాల భూమి తెలంగాణకు వస్తుందని అధికారులు తెలియజేశారు.
Telangana Bhavan in Delhi : మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నట్లు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబించేలా నూతన భవనం నిర్మించుకుందామని సీఎం అన్నట్లు భవన్ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి భవన్ మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పార్లమెంటు మాదిరి అసెంబ్లీ భవనాలు - నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం