బీఆర్‌ఎస్ విస్తరణ కోసం ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు Revanth Reddy Comments on BRS : రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే.. ప్రజాధనంతో పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు అక్కడి మనుషులను తెచ్చుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ విస్తరణ కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారని రేవంత్ విమర్శించారు. మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరిన శరత్‌మర్కట్ అనే యువకుడికి సీఎంవోలో రూ.లక్షన్నర వేతనంతో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని రేవంత్ ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారని అన్నారు. ప్రజల సొమ్ముతో ఏడాదికి రూ.18 లక్షల వేతనం ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి విద్యార్థి, నిరుద్యోగులు మద్ధతు పలకాలని ఆయన కోరారు. ఈ నెల 8వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
"సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శరద్ మర్కడ్ బీఆర్ఎస్లో చేరారని పత్రికల్లో వచ్చింది. శరద్ మర్కడ్‌కు సీఎంవోలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. పార్టీలో చేరిన 20 రోజులకే రూ.లక్షన్నర వేతనంతో నియమించారు. ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే ఇలాంటి నియామకాలా? పక్క రాష్ట్రం వారిని తీసుకొచ్చి అడ్డగోలుగా ఉద్యోగం ఇస్తారా? బీఆర్‌ఎస్ కార్యక్రమాల కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారు. ఈ నెల 8న జరిగే యూత్ డిక్లరేషన్ సభకు నిరుద్యోగులు తరలిరావాలి".- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Priyanka Gandhi Hyderabad tour: వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని.. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ సరూర్‌నగర్ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటిని భర్తీ చేయకుండా ఆర్భాటపు ప్రకటనలు వేస్తోందని విమర్శించారు. చివరకు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు సంతలో సరకులుగా మార్చేశారని ధ్వజమెత్తారు. రూ.వందల కోట్లకు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారని రేవంత్ ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
హనుమాన్ చాలీసాకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: కాంగ్రెస్ పార్టీ హనుమాన్ చాలీసాకు వ్యతిరేకం కాదని రేవంత్ స్పష్టం చేశారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు వస్తే కలిసి హనుమాన్ చాలీసా చదువుకుందామని ఆహ్వానించారు. బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి నినాదాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీని గెలిపించేందుకే కర్ణాటకలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించిన ఆయన.. అక్కడ హంగ్ వస్తే బీజేపీ, జేడీఎస్‌ల మధ్య సయోధ్య కుదుర్చుతారన్నారు.
ఇవీ చదవండి: