Revanth Reddy Comments On KCR And BJP : కేసీఆర్ కుర్చీ కదులుతుందనే భయంతో.. కేటీఆర్ దిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ దిల్లీ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో.. మెట్రో రైలు కోసమో.. రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని విమర్శించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ దిల్లీ టూర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని.. పత్రికల్లో, మీడియాలో వాటి వివరాలు రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికే కేసీఆర్.. మోదీకి లొంగిపోయారని వివరించారు. దిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. తెలంగాణ గల్లీల్లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరన్నారు.
Revanth Reddy Criticizes KTR Visit To Delhi : రాష్ట్ర ఆవిర్భవించిన పదేళ్ల కాలంలో కేసీఆర్ తెలంగాణను సర్వస్వం దోచుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రూ.100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న మోదీ.. మరి లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. శనివారం దిల్లీ వెళ్లి నడ్డా, అమిత్ షాను కలసి వచ్చిన ఈటల, రాజగోపాల్ రెడ్డి ఇంకా ఆ పార్టీపై భ్రమలు పెట్టుకోవద్దని హితవు పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ది మీరు అనుకుంటే తెగిపోయే బంధం కాదని.. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని స్పష్టం చేశారు.