revanth reddy comments on cm kcr praja deevena sabha: మునుగోడు ప్రజలను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ యువకులకు ఏ రకంగా ఉపాధి కల్పిస్తారో చెప్పలేదని ధ్వజమెత్తారు. మునుగోడులో శనివారం జరిగిన సభలో ఉపాధి, ప్రాజెక్టులపై మాట్లాడకుండా.. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారని మండిపడ్డారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
''నిన్నటి సభలో సీఎం కేసీఆర్ మునుగోడుకు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పలేదు. జాతీయ రాజకీయాలు చెప్పి మళ్లీ వంచించే ప్రయత్నం చేశారు. రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయలు కేసీఆర్‌కు సహాయం చేసినట్లు చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? ఎందుకు సహాయం చేశారు. దానిని రాజగోపాల్ రెడ్డి ఇన్‌కమ్‌ట్యాక్స్ లెక్కల్లో చూపెట్టారా. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలోగా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తారో చెప్పలేదు. పోడు భూముల సమస్యను ఎలా తీరుస్తారో చెప్పలేదు. చర్లగూడెం, కిస్టరాయపల్లి భూ నిర్వాసితుల సమస్యను ప్రస్తావించలేదు. ఈడీ, సీబీఐల మీద మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు కేసీఆరే.. భాజపాకు మీరే ఆదర్శం. పార్టీల విలీనానికి కిటికీలు తెరిచింది మీరు. ఏకలింగంగా ఉన్న భాజపాను మూడు తోకలు చేసింది నువ్వే కదా. లేని భాజపాను ప్రత్యామ్నాయంగా సృష్టించింది నీవు కాదా. తెలంగాణపై భాజపా ముప్పేట దాడికి కారణమే కేసీఆర్.'' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికపై.. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఎల్లుండి దిల్లీలో మునుగోడు ఉపఎన్నికపై.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించనుంది. ఆ సమావేశానికి పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ హాజరుకానున్నారు. భేటీకి రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను అధిష్ఠానం దిల్లీకి పిలిచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.