Revanth Reddy On Singareni: యూపీఏను చీల్చి.. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీని బలపరచేందుకే సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే యూపీ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయాలని సవాల్ విసిరారు. కానీ అవేమీ చేయకుండా ఓ వైపు మోదీని విమర్శిస్తూనే.. మరో వైపు ఉత్తరప్రదేశ్‌లో గెలిచేది నరేంద్ర మోదీనే అని చెప్పడం.. పలు అనుమాలకు తావిస్తోందన్నారు. అంతకుముందుగా సింగరేణి సంస్థలో రూ. 50 వేల కోట్ల కుంభకోణానికి కుట్ర చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒడిశాలోని నైని కోల్‌మైన్‌ను అదానీకి కట్టబెట్టనున్నారని ఆయన మండిపడ్డారు. అత్యంత నాణ్యమైన బొగ్గు కలిగిన నైని కోల్‌మైన్‌లో సొంతంగా ఉత్పత్తి చేయకుండా.. సింగరేణి 25 ఏళ్లకు టెండర్లు పిలుస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఫేల్ కంటే పెద్దది
సింగరేణి బొగ్గు గని ప్రైవేటుపరం కాకుండా తెరాస అడ్డుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ అంశంపై పార్లమెంటులో ప్రస్తావించకుండా కేంద్రానికి సహకరించిందని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఉన్న.. సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిదేళ్లుగా కొనసాగించడం వెనక కారణం.. నైనీ కోల్‌మైన్‌ను కొల్లగొట్టడమేనని వ్యాఖ్యానించారు. గుత్తేదారులకు అనుకూలంగా సింగరేణి సీఎండీ పనిచేస్తున్నారన్నారు. సింగరేణిలో జరగబోతున్న కుంభకోణం.. రఫేల్ కుంభకోణం కంటే పెద్దదని పేర్కొన్నారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ తాను నిస్సహాయుడినని కేంద్ర మంత్రి చెప్పారని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థలో రూ. 50 వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది. ఈ కుంభకోణం రఫేల్ కంటే పెద్దది. ఒడిశాలోని నైని కోల్‌మైన్‌ను అదానీకి కట్టబెట్టబోతున్నారు. సింగరేణి సంస్థకు చెందిన నైని కోల్‌మైన్ టెండర్లలో కుట్ర జరుగుతోంది. అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరాం. ఏమీ చేయలేనని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గుత్తేదారులకు అనుకూలంగా సింగరేణి సీఎండీ పనిచేస్తున్నారు. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు