Regularization of lands: రాష్ట్రంలో అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. హక్కులు లేని లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేసే కార్యచరణకు నడుం బిగించింది. స్థలాల క్రమబద్ధీకరణ చేసేందుకు భాగంగా హక్కులు లేని ఇంటి స్థలాలకు ప్రభుత్వం హక్కు పత్రాలు అందించబోతుంది. ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, ఆక్రమిత ప్రభుత్వ స్థలాలు, నోటరీ ఒప్పందాలతో కొనుగోలు చేసినవి, ఇనాం భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ లాంటి ప్రభుత్వ రకానికి సంబంధించిన భూముల్లో వెలసిన ఇళ్లకు హక్కులు కల్పించనుంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి జీవో నంబర్ 58,59 కింద క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాగా మిగిలిన స్థలాల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.
స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి శాశ్వత హక్కులు కల్పించాలనేది ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమించిన సర్కారి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఒక దఫా 2014-2016 సంవత్సరాల మధ్య ప్రభుత్వం పట్టాలు అందజేసింది. తర్వాత దాని గడువు తేదినీ 2020 జూన్ రెండు నాటికి పొడిగించింది. ప్రస్తుతం రెండో దఫా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నడస్తున్న దఫాలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంకా మరో లక్ష వరకు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో 125చ.గజాల లోపు ఉన్న స్థలాలన్ని జీవో 58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 125చ.గజాల పై విస్తీర్ణం ఉన్న స్థలాలను జీవో 59 కింద క్రమబద్ధీకరిస్తారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు.
జంట నగరాల్లో అనేక ఒప్పందాలు: హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల పరిధిలో నోటరి ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూములు చాలానే ఉన్నాయి. ఈ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి యాజమాన్య హక్కు పత్రాల్లేవు. ఆరు లక్షల వరకు నోటరీ స్థలాలు ఉంటాయని గుర్తించారు. ఎంతోమంది చేతుసు మారిన ఈ స్థలాలపై యాజమాన్య హక్కులను నిర్ధారించడం వల్ల శాశ్వత హక్కులు కలుగనున్నాయి.