Shamshabad Airport: దేశంలో మొట్టమొదటిసారి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో మొదలైంది. అప్పట్లో కోటి 20లక్షల మంది విమాన ప్రయాణీకులు రాకపోకలకు సరిపడా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలల్లో ప్రయాణించిన విమాన ప్రయాణీకులు సగటును 20శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని 2019లో రెండు కోట్ల పది లక్షల మంది ప్రయాణాలు చేసేందుకు వీలుగా సౌకర్యాలను విస్తరించారు. ఏటికేడు అంతర్జాతీయ, డొమిస్టిక్ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతోపాటు విమానాల రాకపోకలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
శరవేగంగా విస్తరణ పనులు.. గణనీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టును జీఎంఆర్ యాజమాన్యం మరింత విస్తరిస్తోంది. తూర్పు, పశ్చిమ దిశల్లో మరో రెండు టెర్మినల్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 75విమానాలు పార్కింగ్ చేసుకోవడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్‌వే అనుకూలంగా ఉంది. విస్తరణ పనులు పూర్తి చేయడం ద్వారా వంద విమానాలు పార్కింగ్ చేసేందుకు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. విస్తరణ పూర్తయితే 149 చెక్‌ఇన్ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మిషన్లు.. 44 ఎమిగ్రేషన్, 44 ఇమిగ్రేషన్ కౌంటర్లు కూడా అందుబాటులోకి వస్తాయని జీఎంఆర్ యాజమాన్యం తెలిపింది.