Consumer Commission: విమాన ప్రయాణం రద్దయిన నేపథ్యంలో టికెట్ల సొమ్ముకు 6 శాతం వడ్డీతో పాటు రూ.5 వేల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.5 వేలను 45 రోజుల్లో చెల్లించాలని ఎయిర్ ఇండియాను రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పర్‌పల్లి గోల్డెన్ హైట్స్ కాలనీకి చెందిన గోపీక్రిష్ణ హైదరాబాద్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు రానుపోను ప్రయాణం కోసం రూ.2,47,778 వెచ్చించి 2020 అక్టోబరులో మూడు ఎయిర్ ఇండియా టిక్కెట్లు బుక్ చేశారు.
కొన్ని కారణాలతో తిరుగు ప్రయాణం రద్దు కావడంతో దానికి సంబంధించిన టికెట్ సొమ్ము తిరిగిచెల్లించేందుకు ప్రతివాద సంస్థ అంగీకరించింది. కానీ, సొమ్మును రీఫండ్ చేయలేదు. పలుమార్లు సంప్రదించినా స్పందించలేదు. ఆరు నెలల కాలయాపన తర్వాత డబ్బు రీఫండ్ అయినట్టు స్టేటస్‌లో చూపించింది. అయితే బ్యాంకు ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను గోపీక్రిష్ణ ఆశ్రయించారు. కరోనా కారణంగా ప్రయాణం రద్దయిందని రాతపూర్వక వివరణలో సంస్థ తెలిపింది. నిబంధనల ప్రకారం మూడు టికెట్లకు రూ.71,437 చెల్లిస్తామని ఫిర్యాదుదారుకు సమాచారమిచ్చినట్లు వివరించింది. దీనిపై విచారించిన కమిషన్ ఈ మొత్తానికి వడ్డీతో పాటు ప్రయాణికుడికి అసౌకర్యం కలిగించినందుకు పరిహారం, కేసు ఖర్చులను చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.